- ప్రజా సమస్యలపై అడిగితే.. వేరే విషయాలు మాట్లాడుతున్నరని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన హరీశ్‌రావు.. సభలో తమ హక్కులకు భంగం కలుగుతోందని, స్పీకర్ తమకు రక్షణగా నిలవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి భాష వినడానికే అసహ్యంగా ఉందని.. ఆయన మాటల కంపు మూసీ నది కంపు కంటే ఎక్కువగా ఉందన్నారు.
స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి హరీశ్మాట్లాడుతూ.. ‘‘అధ్యక్షా, మీరు ఈ సభకు కస్టోడియన్. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయి. మా గొంతు నొక్కుతున్నప్పుడు, మా హక్కులను కాలరాస్తున్నప్పుడు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉంది.
మీరు మా రెస్క్యూకి రావాలి.. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు, మినిట్స్ కాపీకి అసలు పొంతన లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని కనీసం 7 రోజుల పాటు నడపాలని అందరి సమక్షంలో నిర్ణయించినప్పటికీ, మినిట్స్ కాపీలో ఆ ప్రస్తావన ఎందుకు లేదని ఆయన నిలదీశారు. సభలో ఒక నిర్ణయం తీసుకుని, రికార్డుల్లో మరొకటి పొందుపరచడం ఏంటని ప్రశ్నించారు.
అర్ధరాత్రి అజెండా కాపీలా?
సభలో జరగబోయే బిజినెస్ గురించి, అజెండా కాపీలను తెల్లవారుజామున 2, 3 గంటలకు పంపిస్తున్నారని హరీశ్ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సభ్యులు ఎప్పుడు నిద్రలేవాలి? ఎప్పుడు చదువుకోవాలి? సబ్జెక్ట్ మీద ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి?’’ అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభ ప్రారంభానికి 24 గంటల ముందు అజెండా ఇవ్వాలన్న కనీస సంప్రదాయాన్ని కూడా ఈ ప్రభుత్వం పాటించడం లేదని, దీనివల్ల సభలో అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోతోందన్నారు.
ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా తాము మాట్లాడుతుంటే.. సభా నాయకుడిగా ఉన్న సీఎం సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారన్నారు.
‘‘మేము అడిగిన ఏ ఒక్క పాయింట్‌కు సీఎం దగ్గర క్లారిఫికేషన్ లేదు. పైగా మాకు మైక్ ఇవ్వకుండా మా గొంతు నొక్కుతున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు. ప్రొటెస్ట్ చేయడం సభ్యుడి హక్కు అని, మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.
