జగన్ ఆర్నెల్ల పాలన గురించి ఆరు ముక్కల్లో చెప్పిన పవన్

జగన్ ఆర్నెల్ల పాలన గురించి ఆరు ముక్కల్లో చెప్పిన పవన్

ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఈ ఆరు నెలల్లో జగన్ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ శ్రీ జగన్ రెడ్డి గారి, ఆరు నెలల పాలన గురించి ఆరు మాటల్లో చెప్పాలంటే.. విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసికవేధన, అనిశ్చితి, విచ్ఛిన్నము మాత్రమే.

విధ్వంసానికి సంబంధించి.. కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వకంగా వరద నీరుతో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలు.

దుందుడుకుతనానికి సంబంధించి.. కాంట్రాక్టు రద్దులు, పోలవరం, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, అమరావతి రాజధాని, జపాన్ రాయభారి- సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు, ఆర్బిట్రేషన్లు మొదలైన రద్దులు.

కక్షసాధింపుతనానికి సంబంధించి.. శ్రీకాకుళంలోని సామాన్య కార్యకర్తతో మొదలుకొని.. పోలీసు వేధింపులు, జనసేన ఎమ్మెల్యే రాపాక గారి మీద కేసులు బనాయించటం, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గారు ఉరివేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరికివేయటం, చానెల్స్ బ్యాన్ చేయడం, జర్నలిస్టులకి చట్టాల ముసుగులో సంకెళ్లు వేయడం, దుర్గి మండలంలో మగాళ్లు లేకుండా ఊళ్లకి ఊళ్లు ఖాళీ చేయించడం, వారికి ఓటు వేయని వారిని బెదిరించడం, రహదార్లు మూసేయడం, సోషల్ మీడియాలో ఎవరు ఒక్క మాట అన్నా కేసులు పెట్టడం, ఊళ్లలో భయానక వాతావరణం సృష్టించడం.

మానసికవేదనకు సంబంధించి.. విలేజ్ వాలంటీర్ల ఉద్యోగాలు 5 లక్షలు అని చెప్పి, 2 లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే నింపడం, 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టడం, 27 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లడానికి కారణమవడం, ప్రభుత్వ విధానాల వల్ల లక్ష అరవైదు వేల కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్తు గాలిలో కలపడం, ఆంగ్ల మాధ్యమం పేరుతో 90 వేల పైచిలుకు తెలుగు టీచర్ల స్థానంలో విలేజ్ వాలంటీర్స్‌ని నియమించటం, స్థానిక వ్యాపార వేత్తలని, వేరే కులాల వారిని వేధింపులకు గురిచేయడంతో వాళ్లు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం, పెట్లుబడులు ఆంధ్రకు రావని నిరుద్యోగుల్లో నిస్సహాయతను పెంచడం.

అనిశ్చితికి సంబంధించి… వేల కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధానిగా ఉంటుందా? కేంద్రం ఏపీకి నిధులు ఇస్తుందా? నవరత్నాలకి నిధులు ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగుల నెల నెల జీతభత్యాలకి డబ్బులున్నాయా? 40 వేల కోట్లకు పైగా అప్పు, పెట్టుబడులు లేవు.. పెట్టినవి పంపేశారు.. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి?

విచ్ఛిన్నానికి సంబంధించి.. ఆంగ్ల భాష బోధన అనే వాదనతో తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నతకి శ్రీకారం చుట్టారు. 151 అసెంబ్లీ సీట్లు ఉన్న వైసీపీ హనీకర ధోరణిని ఇకనైనా ఆపాలని కోరుకుందాం’’ అంటూ పవన్.. జగన్ ఆరు నెలల పాలనపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.