సేవలను విస్తరించడానికి ప్రచార కార్యక్రమాలు

సేవలను విస్తరించడానికి ప్రచార కార్యక్రమాలు

న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్​ కంపెనీ వన్​97 కమ్యూనికేషన్స్ స్టాక్ ధర విషయంలో తాము ఎలాంటి జోక్యమూ చేసుకోబోమని ఎండీ, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ షేర్​హోల్డర్లకు స్పష్టం చేశారు.  సంస్థను లాభదాయకంగా మార్చడానికి యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగుతాయని అన్నారు. కంపెనీ 22వ యాన్యువల్​ జనరల్​ మీటింగ్​లో​ (ఏజీఎం) ఆయన మాట్లాడుతూ, 2018-–19 వరకు కంపెనీ విస్తరణ మోడ్‌‌‌‌‌‌‌‌లో ఉందని, 2019–-20 నుండి మానిటైజేషన్ మోడ్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించిందని తెలిపారు. ఇది వరకే ప్రకటించిన మేరకు సెప్టెంబర్ 2023తో ముగిసే క్వార్టర్లో పేటీఎంకు ఆపరేషనల్​ ప్రాఫిట్స్​ వస్తాయని శర్మ చెప్పారు. 
"షేరు ధర మారడానికి అనేక అంశాలు కారణమవుతాయి. కంపెనీ లాభదాయకత ఈ విషయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కంపెనీ గ్రోత్​ కూడా షేరు​ ధరను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ రెండు మాత్రమే షేరు ధరల్లో మార్పులకు కారణం కాదు. చిన్న,పెద్ద, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, అనేక ఇతర సెంటిమెంట్లు షేర్ల ధరలను మార్చగలుగుతాయి”అని వివరించారు. కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లి, బలమైన లాభాలను ఆర్జించేలా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రయత్నాలు చేస్తోందని శర్మ చెప్పారు. 

వన్​97 షేరు ఐపీఓ స్థాయి రూ. 2,150కి ఎప్పుడు వెళ్తుందని కొందరు షేర్​హోల్డర్లు మేనేజ్​మెంట్​ను అడిగారు. శుక్రవారం ఈ షేరు రూ.771 వద్ద ముగిసింది. ఏజీఎం సందర్భంగా మాట్లాడిన చాలా మంది  కంపెనీ వ్యాపార విధానాలపై నమ్మకం ఉందని అన్నారు. వన్97 కమ్యూనికేషన్స్ నష్టాలు, షేరు ధర తగ్గడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంస్థలో దాదాపు 3 కోట్ల మంది వ్యాపారులు ఉన్నారని, మరింత మంది వ్యాపారులకు సేవలను విస్తరించడానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టామని విజయ్​ శేఖర్​ శర్మ అన్నారు.