Mohsin Naqvi : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మే నెలాఖరులో నిర్వహించబోయే త్రైమాసిక సమావేశాలకు భారత్‌లోని అహ్మదాబాద్ నగరం వేదిక కానుంది. ఈ హై-లెవెల్ మీటింగ్స్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ హాజరవుతారా? లేదా? అనే అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్-పాక్ మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలతో అతడి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వేదిక మార్పు:
ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC) సమావేశం మే 21వ తేదీన వర్చువల్‌గా జరగనుంది. ఆ తర్వాత మే 30, 31 తేదీల్లో ఐసీసీ బోర్డు సభ్యుల ఫిజికల్ మీటింగ్ (ప్రత్యక్ష సమావేశం) జరగబోతోంది. నిజానికి ఈ సమావేశాలు ఖతార్‌లోని దోహాలో జరగాల్సి ఉండగా, గల్ఫ్ రీజియన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఐసీసీ ఈ మీటింగ్‌ను అహ్మదాబాద్‌కు మార్చింది. కాగా ఈ వీకెండ్‌లో అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది.
పాక్ బోర్డు చీఫ్ నఖ్వీ పర్యటనపై సస్పెన్స్!:
ఐసీసీ బోర్డు సమావేశాలకు అన్ని దేశాల క్రికెట్ బోర్డుల అధ్యక్షులు హాజరవుతారు. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెర్మన్ మొహసిన్ నఖ్వీ రాకపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. నఖ్వీ కేవలం పీసీబీ ఛైర్మన్ మాత్రమే కాదు.. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా (Interior Minister), అలాగే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో మొహసిన్ నఖ్వీ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ.. ఇప్పటి వరకు ఆసియా కప్ ట్రోఫీని భారత జట్టుకు అధికారికంగా అందజేయకపోవడంపై బీసీసీఐ (BCCI) తీవ్ర అసంతృప్తితో ఉంది. క్రికెట్ అభిమానులు కూడా దీనిపై నఖ్వీని ట్రోల్ చేస్తున్నారు.
అహ్మదాబాద్ వైపే క్రికెట్ ప్రపంచం చూపు!:
రాబోయే ఐసీసీ టోర్నమెంట్లు, బడ్జెట్ కేటాయింపులు లాంటి కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇలాంటి కీలక సమయంలో భారత్-పాక్ క్రికెట్ సంబంధాలు మునుపటి కంటే మరింత సున్నితంగా మారాయి. మరి ఈ ఉద్రిక్తతల నడుమ మొహసిన్ నఖ్వీ అహ్మదాబాద్ అడుగుపెడతారా? లేక ఈ ప్రతిష్టాత్మక మీటింగ్‌కు గైర్హాజరవుతారా? అనేది సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
🚨 MOHSIN NAQVI INVITED FOR IPL 🚨
— Rayham. (@RayhamUnplugged) May 16, 2026
- PCB Chairman Mohsin Naqvi has been invited to attend the IPL final and ICC meeting in Ahmedabad. (Geo News) pic.twitter.com/fanpsHldZC
