
మాటలు మంచిగ రాకుంటే తగిన బుద్ధి చెప్తం:షబ్బీర్ అలీ
హైదరాబాద్, వెలుగు: జానెడంత లేని కేటీఆర్.. అహంకారంతో మాట్లాడుతున్నారని పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ షబ్బీర్‌అలీ ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తుంటే మనం ప్రజాస్వా మ్యంలో ఉన్నామా అన్న సందేహం కలుగుతున్నదని విమర్శించారు. కేటీఆర్ వస్తున్నాడని కామారెడ్డి, ఎల్లారెడ్డిలో షాపులు బంద్ పెట్టారని, అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘ఖబడ్దార్ కేటీఆర్.. ఎగిరెగిరి పడకు. మాటలు మంచిగా మాట్లాడకుంటే తగిన బుద్ధి చెప్తం. మీ నాయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే. మీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నవ్. కామారెడ్డికి, రాష్ట్రానికి నేనేం చేశానో అసెంబ్లీ సాక్షిగా మీ నాయనే చెప్పిండు.. కావాలంటే విను’ అని అన్నారు. 62 కిలోమీటర్ల మేర ఆరు లైన్లతో చంద్రబాబు ఓఆర్ఆర్ను ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్‌పార్టీనే దానిని 12 లైన్లతో 159 కిలోమీటర్లకు పెంచిందని గుర్తుచేశారు.
మెట్రోను తెచ్చింది కూడా కాంగ్రెస్సేనన్నారు. మేం ఓఆర్ఆర్ వేస్తే.. మీరు సంపాదించుకుంటున్నారంటూ మండిపడ్డారు. మెట్రోను పాతబస్తీ, ఫలక్‌నుమాకు ఎక్స్టెండ్ చేయకుండా ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. తొమ్మిదేండ్లుగా మైనారిటీల కోసం ఏమీ చేయని సర్కారు.. ఇప్పుడు హడావుడిగా రూ.లక్ష ఇస్తమంటూ మోసం చేస్తున్నదన్నారు. ఇచ్చేది కూడా బీఆర్ఎస్కు చెందిన వారికే ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.