బీజేపీ, బీఆర్ఎస్.. బీసీ ద్రోహులు..బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటున్నయ్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

బీజేపీ, బీఆర్ఎస్.. బీసీ ద్రోహులు..బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటున్నయ్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోక తప్పదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం, రాష్ట్ర కేబినెట్ మొత్తం ఢిల్లీలో ఆందోళనలు చేసినప్పుడు.. బీఆర్ఎస్‌‌‌‌, బీజేపీ నేతలు ఎక్కడ తోక ముడుచుకొని కూర్చున్నారు? చివరకు ఇప్పుడు న్యాయపరంగా కోర్టులో పోరాడుతుంటే.. ఈ రెండు పార్టీల నేతలు కనీసం ఇంప్లీడ్ కూడా కాకుండా తమ బీసీ వ్యతిరేక ధోరణిని ప్రదర్శించారు.

 తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలు కావడం ఇష్టం లేని ఈ రెండు పార్టీలు.. బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటున్నాయి”అని మండిపడ్డారు. గురువారం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే తర్వాత గాంధీభవన్‌‌‌‌లో డిప్యూటీ సీఎం భట్టి, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులతో కలిసి మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. శాస్త్రీయంగా కులగణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఆయన వెల్లడించారు. అయితే ఈ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. హైకోర్టు కాపీ అందిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రిజర్వేషన్లకు పరిమితి విధించి బీసీలను అణగదొక్కిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు.

 ‘‘ఏడాది క్రితమే ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే న్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశగా చట్ట పరంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. బీసీ బిల్లుపై అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బీజేపీ నాయకులు.. కేంద్రంలో మాత్రం అడ్డుపడ్డారు. బీఆర్ఎస్ ఒత్తిళ్లకు బీజేపీ నాయకులు యూటర్న్ తీసుకున్నారు”అని ఫైర్ అయ్యారు. బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య బిల్లుకు మద్దతు ఇచ్చారని.. ఆయన బీజేపీ నేతగా కాకుండా, ఒక బీసీగా హైకోర్టులో కూడా ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 

బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌ను ప్రజలు క్షమించరు: భట్టి 

బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కొని.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌‌‌‌లో ఉంది. దాన్ని ఆపింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా? ఇక రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ఆనాడు బీఆర్ఎస్ క్యాప్ విధించింది. బీసీల నోటికాడి ముద్దను లాక్కున్నది ఈ రెండు పార్టీలు కాదా?”అని ప్రశ్నించారు. కులగణన సర్వేలో కూడా పాల్గొనని ఈ పార్టీలు.. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. 

‘‘శాస్త్రీయంగా సర్వే చేసి 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చిత్తశుద్ధితో చట్టపరంగా పోరాటం చేశాం. అలాంటి మాపై బీఆర్ఎస్, బీజేపీ నిందలు వేయడం ఏంటి? బీసీ నేతలు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. ఈ రెండు పార్టీలను క్షమించరు. బీసీ రిజర్వేషన్ల కోసం మా పోరాటం ఆగదు. న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతాం”అని తెలిపారు. ఇప్పుడు పోరాడుతామని అంటున్న బీఆర్ఎస్.. గతంలో తాము ఢిల్లీలో ఆందోళన చేసినప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు. 

బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: పొన్నం 

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు సంబంధించిన కాపీ అందగానే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు. అయినప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్. ఈ కేసులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో బీజేపీ, బీఆర్ఎస్ జవాబు చెప్పాలి”అని డిమాండ్ చేశారు.

బీసీల నోటికాడి ముద్ద లాక్కుంటున్నరు..రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర: మంత్రి వాకిటి 

హైదరాబాద్, వెలుగు: బీసీల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉన్నది కాబట్టే డెడికేటెడ్​కమిషన్ ఏర్పాటు చేసి కులగణన నిర్వహించామని గుర్తుచేశారు. గురువారం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చిన అనంతరం కోర్టు బయట మంత్రి శ్రీహరి మీడియాతో మాట్లాడారు. 

“బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో యావత్తూ తెలంగాణ ఆలోచన చేయాలి. ఎంపరికల్ డేటా ఉన్నా కోర్టు స్టే ఇచ్చేలా చేసి, బీసీల నోటికాడి ముద్ద లాగే ప్రయత్నం చేయడం శోచనీయం. రిజర్వేషన్ల పెంపుపై బీసీలకు ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆలోచన చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీ బిడ్డలెవరూ అధైర్యపడొద్దు.  బీజేపీ, బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా కేసులో ఇంప్లీడ్ అవ్వాలి. లేకపోతే ఆ రెండు పార్టీలు చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతాయి” అని మంత్రి హెచ్చరించారు.