
- తెలంగాణ అభివృద్ధికి వాళ్లిద్దరే అడ్డంకి
- బీఆర్ఎస్‌తో బీజేపీ దోస్తీ కట్టి
- కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభివృద్ధికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డంకిగా మారారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన కులగణనను తప్పులతడక అని అనడం వాళ్ల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్‌తో దోస్తీ కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని చూసి కేంద్రమంత్రులు ఓర్వలేకపోతున్నారని అందులో పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా జరిగితే, దానిపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తారా? దీనిపై బీసీ బిడ్డగా బండి సంజయ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి.
కులగణనతో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారో తేలింది. ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. స్వతంత్ర భారతావనిలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. చారిత్రాత్మక కులగణన ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి నిర్ణయాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది” అని అన్నారు.
చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును ఆమోదించండి..
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని మహేశ్ గౌడ్ తెలిపారు. ‘‘అసెంబ్లీలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో కులగణనకు చట్టబద్ధత కల్పించాం. బీసీలపై మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయండి.
బీసీ బిల్లు చట్టబద్ధత కోసం ప్రధాని మోదీకి లేఖ రాసే దమ్ము మీకుందా?” అని కిషన్ రెడ్డి, సంజయ్‌కి సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించిందని, ఇది కాంగ్రెస్ విజయమని అన్నారు. ఎప్పటి నుంచి కులగణన నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.