పార్టీని వీడిన నేతలు తిరిగి రండి..కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పార్టీని వీడిన నేతలు తిరిగి రండి..కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రతి ఓటు కీలకమే
  • కామారెడ్డి సభను సక్సెస్ చేసి సత్తా చాటి చెప్పాలని పిలుపు​
  • గాంధీ భవన్ లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, వివిధ కారణాలతో అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీని వీడిన నేతలు తిరిగి సొంత ఇంటికి చేరుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ప్రతి ఓటు కీలకమేనని, అందుకే పార్టీని వీడిన వారు తిరిగి రావాలని కోరారు. అయితే, పార్టీలో చేరిన వారికి వెంటనే పదవులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ముందు పార్టీ కోసం పనిచేసి తామేంటో నిరూపించుకుంటేనే పదవులస్తాయన్నారు. 

సోమవారం గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇన్​చార్జ్ ​మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్​ హాజరయ్యారు. మహేశ్ ​గౌడ్ ​మాట్లాడుతూ.. ఈ నెల 15న కామారెడ్డిలో లక్ష మందితో నిర్వహించనున్న బహిరంగ సభను సక్సెస్ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ బలమెంటో బీఆర్ఎస్, బీజేపీకి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. తాను పీసీసీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుండడం, బీసీ డిక్లరేషన్ ప్రకటించి, దాన్ని చిత్తశుద్ధితో ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం చేసి, తమ నిజాయితీని ప్రజలకు తెలిపేందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 

ఈ 20 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తున్న విషయాన్నే కవిత చెప్పారని, ఆమె ప్రకటనతో కేసీఆర్ కుటుంబం దోపిడీ బయట పడిందన్నారు. కేసీఆర్ కుటుంబం దొంగల ముఠా అని, వచ్చే ఎన్నికల్లోగా బీఆర్ఎస్ ఖేల్ ఖతమన్నారు. 

బీఆర్ఎస్ ముక్కలైతది: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇప్పటికే ముక్కలైందని, వచ్చే ఎన్నికల నాటికి అది మరిన్ని ముక్కలై, ఉనికి లేకుండా పోనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇందిరమ్మ సర్కార్​ వచ్చాక సంక్షేమ కార్యక్రమాలకే రూ.99,529 కోట్లు ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు ఆగిందని చెప్పారు. ఇంట్లో దోపిడీ దొంగలు పడి ఉన్నదంతా దోచుకొనిపోతే .. ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పాలన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉందన్నారు.  

వారం రోజుల్లో అన్ని కమిటీలు: మీనాక్షి

రాబోయే వారం, పది రోజుల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలను నియమిస్తామని పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లనున్నట్టు చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ వారి పేర్లను నామినేటెడ్ పదవుల భర్తీ కోసం సిఫార్సు చేస్తామన్నారు. ఇకపై రెండు నెలలకోసారి పీసీసీ సమావేశాలను జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని, దీంతో అక్కడి నేతలు, కార్యకర్తలకు పార్టీ మరింత చేరువయ్యే చాన్స్​ ఉంటుందన్నారు. కాంగ్రెస్  నుంచి వెళ్లిన వారు తిరిగి పార్టీలో చేరాలని కోరారు. ఈ నెల 15 తర్వాత గాంధీ భవన్​లో సామాజిక వర్గాల వారీగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్​ ఉంటాయని చెప్పారు. ప్రతి సామాజికవర్గం నుంచి కొత్త నాయకులను రెడీ చేయడమే వీటి ఉద్దేశమని తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించాం: మంత్రి పొన్నం

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడంపైనే పీసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చించామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై  ఎలాంటి వ్యూహ రచనలతో ముందుకు పోవాలనే విషయం చర్చించామని చెప్పారు. బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకొని బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న తీరును కామారెడ్డి సభలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.