సీఎంతో పీసీసీ చీఫ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్

సీఎంతో పీసీసీ చీఫ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్
  • జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం, డీసీసీ కమిటీలపై చర్చ!

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్  మహేశ్  కుమార్  గౌడ్  ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీఎం అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ 23లో ఆదివారం బ్రేక్ ఫాస్ట్  మీటింగ్  జరిగింది. దాదాపు అరగంటకుపైగా సాగిన ఈ భేటీలో పీసీసీ చీఫ్ తో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. డీసీసీ కమిటీల అంశంపై ఇరువురూ చర్చించినట్టు తెలిసింది.

 సుమారు 15 జిల్లాల్లో డీసీసీ చీఫ్  పదవి కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినందున వాటిపై ఇరువురూ సమాలోచన చేసినట్టు సమాచారం. పార్టీ నేషనల్  జనరల్  సెక్రటరీ (సంస్థాగత) కేసీ తో వేరువేరుగా శనివారం జరిగిన మీటింగ్  సారాంశంపైనా మాట్లాడుకున్నట్లు తెలిసింది. అలాగే జూబ్లీ హిల్స్  బైపోల్  ప్రచారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్  ఫేజ్ లో పార్టీపరంగా నిర్వహించనున్న మీటింగ్ లు, ప్రచారానికి అధినాయకత్వం రాక, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వ పథకాలపై డిస్కస్  చేశారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ కొడుకు బారసాలకు సీఎం

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్  నాయుడు కొడుకు బారసాల వేడుక అట్టహాసంగా జరిగింది. ఆదివారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ , నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లోద్ జోషి, శ్రీనివాసవర్మ, ఏపీ అసెంబ్లీ స్పీకర్  అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్  రఘురామ కృష్ణంరాజు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా.. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాత రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్  చేరుకున్నారు.