బీజేపీ డ్రామాలో బీఆర్ఎస్..ఆ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

బీజేపీ డ్రామాలో బీఆర్ఎస్..ఆ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     ప్రతిపక్షాల కుట్రలకు భయపడం.. బీసీ కోటాపై వెనక్కి తగ్గం
  •     ఇయ్యాల ఢిల్లీకి వెళ్తున్నం.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తం
  •     మంత్రులు కొండా, పొంగులేటి వ్యవహారంపై కూర్చొని మాట్లాడుకుంటామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: బీజేపీ పూర్తిగా బీసీ వ్యతిరేక పార్టీ అని పీసీసీ చీఫ్​మహేశ్​ కుమార్ ​గౌడ్ మండిపడ్డారు. ఆ పార్టీకి బీఆర్ఎస్​కూడా తోడైందని ఫైర్ అయ్యారు. ‘‘బీసీ బిల్లులు గవర్నర్​దగ్గర పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. వాటి గురించి ప్రధాని దగ్గరికి వెళ్లి బీజేపీ నాయకులు ఎందుకు అడగడం లేదు. గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్‌‌‌‌లో పెట్టుకుని బీజేపీ నేతలు మాపై నిందలు వేస్తున్నారు. బీసీ సంఘాలు బంద్‌‌‌‌కు పిలుపునిస్తే మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ నేతలు చెప్పారు. 

కానీ బీసీ సంఘాలు ధర్నా చేసినప్పుడు మాత్రం ఈటల, సంజయ్​ఎక్కడ దాక్కున్నారు?. బీజేపీ డ్రామాలో బీఆర్ఎస్ కూడా పాలుపంచుకుంటున్నది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గాంధీభవన్‌‌‌‌లో మీడియాతో మహేశ్​గౌడ్​మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నామని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు భయపడమని పేర్కొన్నారు. ‘‘బీసీ కోటాపై వెనక్కి తగ్గేది లేదు. రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం. సోమవారం నేను, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీకి వెళ్తున్నాం” అని తెలిపారు. 

ఆర్టీఐ చట్టానికి తూట్లు..  

ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చి 20 ఏండ్లవుతున్నదని మహేశ్ గౌడ్ తెలిపారు. ‘‘కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌ హయాంలో చరిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో  సోనియాగాంధీ దూరదృష్టితో 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమల్లోకి తెచ్చారు. ఇది పేద, అణగారిన వర్గాలకు జీవనరేఖగా మారింది. ప్రజలు తమ హక్కులను సాధించుకునే శక్తిని ఇచ్చింది. కానీ కాంగ్రెస్​తెచ్చిన కీలక చట్టాలను బీజేపీ నిర్వీర్యం చేస్తున్నది. 

అంబానీ, అదానీ కోసం ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తున్నది” అని మండిపడ్డారు. 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తున్నదని, 2019 సవరణలతో సమాచార కమిషన్ల స్వతంత్రతను బలహీనపరిచిందని ఫైర్ అయ్యారు. పేదలకు ఉపాధి కల్పించేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. 

రేపట్నుంచి జూబ్లీహిల్స్‌‌‌‌లో బస్తీబాట.. 

మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంపై ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని తేల్చుకుంటామని మహేశ్​కుమార్​గౌడ్​తెలిపారు. ‘‘ఇది చాలా చిన్న సమస్య. నన్ను సీతక్క, కొండా సురేఖ కలిశారు. ఫిర్యాదులా కాకుండా అక్కడ ఉన్న సమస్య వివరించారు. దాంట్లో నిజానిజాలను  తెలుసుకొని స్పందిస్తాను’’ అని చెప్పారు. ఈ నెల 14  నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీబాట చేపడతామన్నారు. ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.