24 గంటల కరెంటు నిరూపిస్తే..నామినేషన్ రిటర్న్ తీసుకుంట: రేవంత్రెడ్డి

24 గంటల కరెంటు నిరూపిస్తే..నామినేషన్ రిటర్న్ తీసుకుంట: రేవంత్రెడ్డి
  • అలంపూర్ సబ్ స్టేషన్లనే కూసుంట ఎవరొస్తరో  రండ్రి
  • ఇయ్యకుంటే  కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
  • ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కులు కాంగ్రెస్ పార్టీవే
  • మేం గెలిస్తే 24 గంటల ఉచితకరెంటు ఇచ్చి తీరుతం
  • ఆర్డీఎస్ మీద కర్నాటకలోత పంచాయితీ తెంపుత
  • డీకే శివకుమార్ నాకు మంచి దోస్త్, సిద్ధరామయ్యకు నేనంటే అభిమానం

అలంపూర్: వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు చూపిస్తే తాను వేసిన నామినేషన్ రిటర్న్ తీసుకుంటానని, అలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్ నామినేషన్ వేయబోరని పీసీసీ చీఫ్ రేవంత్ సవాలు విసిరారు. తాను అలంపూర్ సబ్ స్టేషన్ లోనే కూర్చుంటానని, బీఆర్ఎస్ లీడర్లొస్తరో.. కేసీఆర్ వస్తరో రావాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంటు ఇచ్చినట్టు నిరూపించకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అలంపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కు చీము నెత్తురు ఉంటే తాను మూడు గంటలే కరెంటు ఇస్తం అని ఎక్కడన్నానో నిరూపించాలని సవాలు విసిరారు. ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కులు కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని, మొదట ఫ్రీ కరెంటును అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్  పార్టీ గెలిస్తే రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తామని చెప్పారు.

అలంపూర్ జోగులాంబ ఆలయానికి వంద కోట్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. నడిగడ్డ పౌరుషానికి మారుపేరని, తలతెగిపడ్డా యుద్ధం చేసిన వారసత్వమని పేర్కొన్నారు. అలాంటి నడగడ్డ బిడ్డ చల్లా వెంకట్రాంరెడ్డి దొర దొడ్డిలో జీతగాడిగా కుదిరాడని, ఎమ్మెల్సీ పదవి కోసం నడిగడ్డ పౌరుషాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టారని మండి పడ్డారు. ఆర్డీఎస్ పై కర్నాటక తో ఉన్న పంచాయితీ తెంపే బాధ్యత తానే తీసుకుంటానని, తనకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మిత్రుడని, సీఎం సిద్ధరామయ్యకు తనంటే ఎంతో అభిమానమని చెప్పారు. వారితో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తానని భరోసా ఇచ్చారు.

ఈ ప్రాంతంలో పుట్టిన సంపత్ కుమార్‌‌ ఉన్నత చదువులు చదివారని,  ఏఐసీసీ సెక్రటరీ స్థాయికి ఎదిగారని అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఇది పాలమూరు ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే  అభివృద్ధి అంటే ఏమిటో  చేసి చూపిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి బందైతే రైతుబంధు రాదని కేసీఆర్ భయపెడుతున్నారని, 2018లో రైతుబంధు స్టార్టయిందని, ఆ తర్వాత ధరణి వచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ తాగి మాట్లాడుతున్నరా..? అనేది అర్థం కావడం లేదన్నారు.

ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, కల్వకుంట్ల కుటుంబమే పెద్ద దళారీ ఫ్యామిలీ అని, ధరణిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకుంటోందని అన్నారు. ధరణికి దీటైన యాప్ తీసుకొచ్చి భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. 

డబుల్ బెడ్రూం ఇండ్లిచ్చినవా..

డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లయితే ఆ గ్రామాల్లో ఓట్లు బీఆర్ఎస్ వాళ్లు వేయించుకోవాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో ఓట్లు కాంగ్రెస్ కు వేసుకుంటం.. ఈ సవాలును కేసీఆర్ స్వీకరిస్తారా..? అని ప్రశ్నించారు. తనకు నడిగడ్డతో 1984 నుంచి అనుబంధం ఉందని, ఇక్కడి రాజకీయాలతోనూ ప్రత్యక్ష సంబంధాలున్నాయని చెప్పారు. ఐజ తిర్మల్  రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని అన్నారు. ప్రజల తెలంగాణ కావాలా..? దొరల తెలంగాణ కావాలా..? ప్రజలు తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.