ఒక్కొక్కరిపై లక్ష అప్పు

ఒక్కొక్కరిపై లక్ష అప్పు
  • సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఫైర్
  • దళితుల ఓట్లను గుత్తగా దోచుకునేందుకే  దళిత బంధు స్కీం తెచ్చిండు
  • దళితులు, గిరిజనులందరికీ 10 లక్షలు ఇచ్చే దాకా వదలొద్దు
  • ఇంద్రవెల్లిలో లక్ష మందితో దండోరా సభ నిర్వహించి తీరుతం
  • ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ పోస్టర్ ​రిలీజ్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​ రూ.వేల కోట్లు దోచుకొని విదేశాల్లో ఆస్తులు పెంచుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దళిత గిరిజనుల జీవితాల్లో మాత్రం ఇంకా చీకటే ఉందన్నారు. కేసీఆర్​రాష్ట్రంలో  ప్రతీ ఒక్కరి మీద లక్ష రూపాయల అప్పు చేసి పెట్టిండని విమర్శించారు. ఈ నెల 9వ తేదీ నుంచి తలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్​ను బుధవారం గాంధీభవన్​లో పార్టీ నేతలతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘దళితుల ఓట్లను గుండు గుత్తగా దోచుకునేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు అని అంటున్నారు. కానీ ఆయనకు దళిత, గిరిజనుల సంక్షేమం గురించి చిత్తశుద్ధి లేదు. ఆదివాసీ ఆడబిడ్డలను చెట్టుకేసి 
కొడుతుంటే సన్నాసి కేసీఆర్ కు కనిపించడం లేదా? వాళ్ల బోరు బావుల్లో బండరాళ్లు వేసి మంచి నీళ్లకు దూరం చేస్తున్న విషయం తెలియదా?’ అని నిలదీశారు. 
ఒక్క మనిషి తక్కువైనా గులాంగిరి చేస్తా..
119 నియోజక వర్గాల్లోని దళిత, గిరిజన బిడ్డలందరికీ పది లక్షలు ఇచ్చేంత వరకు కేసీఆర్​ను వదిలి పెట్టొద్దని రేవంత్ అన్నారు. ‘దళిత బంధును కేసీఆర్ హుజూరాబాద్​కే పరిమితం చేయాలని చూస్తున్నారు. దీన్ని గమనించి నిజాం నాటి రజాకార్ల మీద పోరాటం చేసినట్లే కేసీఆర్​పై పోరాడాలి. కేసీఆర్ సర్కారును గద్దె దించే వరకు ఇది సాగాలి. దీనికి ఇంద్రవెల్లి సభ నాంది కావాలి. లక్ష మందితో సభ నిర్వహించి తీరుతాం. ఒక్క మనిషి తక్కువైనా నీ దగ్గర గులాంగిరి చేస్తా..’ అని కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు.

ఆదివాసుల హక్కులు ప్రభుత్వం లాక్కొంటుంది

దళిత, గిరిజనులకు కాంగ్రెస్ ఎంతో సేవ చేసిందని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కీలక అంశాల్లో వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. భూహక్కుల కోసం చట్టాన్ని కూడా తెచ్చిందని గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్​ప్రభుత్వం ఆదివాసుల హక్కులన్నీ లాగేసుకుంటోందన్నారు. ఆత్మగౌరవంతో బతకాలని రాష్ట్రం తెచ్చుకుంటే కేసీఆర్ మాయమాటలు చెప్పి రాష్ట్ర వనరులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గిరిజన, ఆదివాసీల కోసం బీజేపీ, టీఆర్ఎస్​ ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నారు. పోడు భూములపై కాంగ్రెస్​ హక్కులు కల్పించిందనీ, ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. అందుకే వాళ్ల కష్టాలను తీర్చే బాధ్యత కాంగ్రెస్​ తీసుకుందన్నారు.  ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ గౌడ్​ మాట్లాడుతూ.. కుమ్రం భీం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ నుంచే కేసీఆర్​ మీద యుద్ధం ప్రకటిస్తున్నామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారమయ్యే దాకా రాజీలేని పోరాటం చేస్తామమన్నారు. కార్యక్రమంలో సీనియర్​ నేతలు మల్లు రవి, అంజన్​ కుమార్ యాదవ్, ప్రేమ్​ సాగర్​రావు, బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.