డీఏవీ స్కూల్ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి:రేవంత్ రెడ్డి

డీఏవీ స్కూల్ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి:రేవంత్ రెడ్డి

ప్రైవేటు స్కూళ్లలో చిన్నారుల భద్రతపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుల వసూళ్లలో కక్కుర్తి పడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు.. పిల్లల భద్రతను గాలికి వదిలేస్తున్నాయని మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని DAV పాఠశాలలో పిల్లలపై అత్యాచారం క్షమించరాని నేరమన్నారు. ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యంతో పాటు  బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

దారుణం...
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ LKG చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. డిజిటల్ క్లాస్ రుమ్లోకి  వెళ్లి నీచుడు రజనీ కుమార్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడని గుర్తించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కీచకుడు స్కూళ్లో  మరికొంత మంది విద్యార్థులపై కూడా వేధింపులకు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రుల ఆందోళన..
డీఏవీ  పాఠశాల లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీంతో డీఏవీ స్కూల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.అటు  డ్రైవర్ రజినీ కుమార్తో పాటు ప్రిన్సిపాల్ మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవి పై కేసు నమోదయింది. ఇద్దరిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.