తుమ్మిడిహట్టి కట్టాల్సిందే..కాంగ్రెస్ డిమాండ్

తుమ్మిడిహట్టి కట్టాల్సిందే..కాంగ్రెస్ డిమాండ్

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి డిమాండ్​ చేశారు. తమ హయాంలో మొదలుపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్​ సర్కార్​ కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్​ చేసిందని ఆయన ఆరోపించారు. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా ప్రాణహిత సంగమ స్థానమైన కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని పీసీసీ బృందం సందర్శించింది. పీసీసీ చీఫ్​ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి  విక్రమార్క, ఎంపీ రేవంత్​రెడ్డి, ఇతర నాయకులు మొదట అంబేడ్కర్​ విగ్రహం వద్ద నివాళులర్పించి, ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేశారు. నాటు పడవలో నదిలో ప్రయాణిస్తూ వరద ప్రవాహాన్ని పరిశీలించారు.

అనంతరం అక్కడే మీడియా సమావేశంలో ఉత్తమ్​ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్​ హయాంలో ప్రారంభించిన డాక్టర్​ బీఆర్ అంబేడ్కర్​ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్​ పేరిట ఎటూకాకుండా చేసిన ఘనత కేసీఆర్​దేనని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు. గ్రావిటీ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా రైతాంగానికి సాగు నీరును అందించే తుమ్మిడిహట్టి బ్యారేజీని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఇతర  ప్రాంతానికి తరలించారన్నారు. రీ డిజైన్​ చేసిన తర్వాత కూడా కేసీఆర్​ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కడుతామని చెప్పారని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు. రూ. 80వేల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు గుదిబండలా మారుతోందని, ఈ ప్రాజెక్టుకు గ్లోబల్​ టెండర్లు పిలువకపోవడంలో ఉన్న మతలబ్​ ఏందని  ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి  బ్యారేజీని కట్టేంత వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేసీఆర్​: భట్టి

రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకునేందుకు కేసీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తికాక ముందే సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​ రైతాంగంతోపాటు తెలంగాణ ప్రజల నోట్లో కేసీఆర్​ మట్టి కోడుతున్నారని ఆయన విమర్శించారు.

కేసీఆర్​వి మాయమాటలు: రేవంత్​

తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించలేని కేసీఆర్​ రాయలసీమను రతనాలసీమగా చేస్తాననడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎంపీ రేవంత్​రెడ్డి విమర్శించారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్​ మాయమాటలు చెబుతున్నారని ఆయన అన్నారు.  బీజేపీ, టీఆర్​ఎస్ మధ్య  లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకే టీఆర్​ఎస్​ సర్కార్​ అక్రమాలపై కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అక్రమాలు, అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్​బాబు, నాయకులు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, రాథోడ్​ రమేశ్, షబ్బీర్​ అలీ, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి