రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ

రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ

రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని, టీఆర్ ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ అధిష్టానం నిర్ణయాలను తప్పుపడుతూ ఐదు రోజుల కింద రాజగోపాల్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ, బయటా తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ మూడు రోజుల కింద భేటీ అయి.. రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలపై చర్చించి, అది క్రమశిక్షణ ఉల్లంఘనేని అభిప్రాయానికి వచ్చింది. దీనిని ఏఐసీసీకి నివేదించింది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కమిటీ చైర్మన్ కోదండరెడ్డి తాజాగా షోకాజ్ నోటీస్  జారీ చేశారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంటుందని, ఎలాంటి అభిప్రాయాలనైనా పార్టీ వేదికలపై చర్చించవచ్చని పేర్కొన్నారు. కానీ మీడియా ముందు అలా మాట్లాడటం క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తుందని భావించి నోటీసు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

చర్యలు తప్పవా?…

గతంలో ఒకసారి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు ఇవ్వగా.. ఆయన వివరణతో సంతృప్తి చెందిన కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఆయన ఇచ్చే వివరణను బట్టే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అయితే కర్నాటకలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోషన్ బేగ్ ను కాంగ్రెస్ హైకమాండ్ బుధవారమే సస్పెండ్ చేసింది. అది జరిగిన రోజే ఇక్కడ షోకాజ్​ జారీ కావడం గమనార్హం. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘనపై తీవ్ర చర్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.