- ఫోన్‌లోనూ ఆమె వివరణ ఇచ్చారు
- పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
- రాజగోపాల్ రెడ్డిపై కమిటీకి ఎలాంటి ఫిర్యాదు రాలేదు
- దీనిని సుమోటోగా తీసుకోవాలా? లేదా?
- అనే విషయం పరిశీలిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అందరి ఫిర్యాదులు అందాకే మంత్రి కొండా సురేఖపై తుది నిర్ణయం తీసుకుంటామని పీసీసీ క్రమ శిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. ‘‘మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. తాము కూడా ఫిర్యాదు చేస్తామని, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఇంకొందరు విజ్ఞప్తిచేశారు. అందరి ఫిర్యాదు అందాక, వాటన్నింటినీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపారు.
శనివారం గాంధీ భవన్‌లో మల్లు రవి అధ్యక్షతన పీసీసీ క్రమశిక్షణా కమిటీ దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రికార్డులను, ఆ తర్వాత కూతురు వ్యాఖ్యలపై సురేఖ ఇచ్చిన వివరణను కూడా కమిటీ పరిశీలించింది. అనంతరం మల్లు రవి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రెండు రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు సురేఖపై క్రమ శిక్షణా కమిటీకి ఫిర్యాదు చేస్తామని మీడియా ముందు చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని అందరి ఫిర్యాదులు వచ్చాక పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రి హోదాలో ఉన్న వారిపై ఫిర్యాదు వచ్చినప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలా అని తమకు ఏ నేతపై ప్రేమ, అభిమానం, ద్వేషం ఉండవని, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగానే క్రమ శిక్షణా కమిటీ నిర్ణయాలు ఉంటాయని మల్లు రవి స్పష్టం చేశారు.
సీఎం స్థాయి వ్యక్తిపై సుస్మిత చేసిన విమర్శలు సరికాదని, సొంత కూతురు చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఖండించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్న మంత్రి సురేఖ ఇచ్చిన వివరణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. త్వరలోనే కమిటీ మళ్లీ సమావేశం కానుందన్నారు. కాగా, తాము మీటింగ్‌లో ఉండగానే మంత్రి కొండా సురేఖ ఫోన్ చేసి, తాను చెప్పాల్సింది చెప్పారని, వాటిని మీడియా ముందు బహిర్గతం చేయలేనని పేర్కొన్నారు.
చిన్నారెడ్డి విషయంలో మరోసారి ఎమ్మెల్యేతో మాట్లాడుతాం..
ఇక చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను, ఆ తర్వాత దానిపై ఆయన ఇచ్చిన వివరణను కూడా కమిటీ పరిశీలించిందని మల్లు రవి చెప్పారు. కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని మరోసారి పిలిచి మాట్లాడాకే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో క్రమ శిక్షణా కమిటీ తనకున్న పరిమితులకు లోబడి పనిచేస్తుందని చెప్పారు.
ఇప్పటి వరకు ఆయనపై కమిటీకి ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అందుకే ఆయన విషయం చర్చకు రాలేదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమకు తెలుసని, ఫిర్యాదు అందకపోవడంతో సుమోటోగా తీసుకునే విషయంపై పరిశీలిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపైనా చర్చించామని, కానీ అక్కడి డీసీసీ అధ్యక్షుడు అందుబాటులో లేకపోవడంతో మరోసారి ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తామన్నారు
