
- రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాడుతున్నది: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
- న్యాయమైన డిమాండ్కోసం అధికారంలో ఉన్నా మద్దతు
- ప్రజలు స్వచ్ఛందగా బంద్ పాటించారని వెల్లడి
- ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి
- పలు చోట్ల బంద్‌లో పాల్గొన్న మంత్రులు
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను కేంద్రంలో బీజేపీ అడ్డుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్వహించిన ప్రదర్శనలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఇతర నేతలతో కలిసి మహేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం” అంటూ నినాదాలు చేశారు. అనంతరం మహేశ్ గౌడ్మాట్లాడుతూ.. బీసీ జేఏసీ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారని తెలిపారు.
న్యాయమైన కోరిక ఉత్పన్నమైనప్పుడు అధికారంలో ఉన్నా.. మద్దతు పలకాలని, అందుకే మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో మొదటి సారి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి.. బిల్లులను గవర్నర్ కు పంపితే కేంద్రం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. కేంద్రం వద్ద ఇది పెండింగ్ లో ఉందని ప్రజలకు తెలుసునని.. ఈ బంద్ తో ప్రధానికి కనువిప్పు కలగాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్దామని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం బీసీ బిల్లును
ఆమోదించాలి : మంత్రి సీతక్క
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అందుకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, కులగణన ప్రక్రియను ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశామన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని.. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుండా బిల్లును నిలిపివేస్తోందని ఆమె విమర్శించారు. “బీజేపీ పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోంది. తెలంగాణలోని బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామంటారు. కానీ, ఢిల్లీలో వారి పెద్దలు ‘నో’ అంటారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ బీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలి” అని సీతక్క డిమాండ్ చేశారు.
బీసీ బిల్లులు ఆపిన పాపం..
బీజేపీకి తగులుద్ది: మంత్రి కొండా సురేఖ
బీసీల పాపం కేంద్రంలోని బీజేపీకి తగులుతుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కంటోన్మెమెంట్ పరిధిలోని రేథిఫైల్ బస్టాండ్ వద్ద బీసీ ధర్నాలో మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రసంగించారు. ‘‘మా సీఎం రెడ్డి బిడ్డ అయినా.. ఛాలెంజ్‌గా తీసుకుని రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ.. గవర్నర్ ఆమోదం తెలుపకుండా అక్కడ అడ్డుకుంటూ.. దొంగాట ఆట ఆడుతున్నదని మండిపడ్డారు. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
9వ షెడ్యూల్లో చేర్చాలి: మంత్రి వాకిటి
బీసీ బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల బిల్లులపై కేంద్రం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ పక్కన ముషీరాబాద్ డిపో 2 వద్ద నిర్వహించిన బంద్ లో మంత్రి వాకిటి శ్రీహరి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ బిల్లును ముందుకు తీసుకెళ్తుందని, దీనికి ఎవరు అడ్డురాకూడదన్నారు. ఇది న్యాయపరమైన డిమాండ్ అని కేంద్రం ప్రభుత్వం ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అన్ని సామాజిక వర్గాలు కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాయని.. అయితే, కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందని ఆలోచన చేయకుండా బీసీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేయాలన్నారు.
బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బీసీ బిల్లులు పాస్ అయ్యాయని.. కానీ, నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంతో జాప్యం జరుగుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు రవాణాశాఖ మంత్రిగా బస్సులు బంద్ చేయడం జరిగిందన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణ బలహీనవర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయాలని కోరారు. రిజర్వేషన్ల అమలులో రాష్ట్రంలో మా బాధ్యత నిర్వహించామని.. బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు. కేంద్రంలో బాధ్యత మీదేనని పేర్కొన్నారు. బంద్ ను విజయవంతం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు.