ప్రజల్లో మనోభావాలు, భావోద్వేగాలు, దేవుడి పేరుతో నిత్యం రాజకీయ లబ్ధి పొందడంలో ఆరితేరిన బీజేపీ ‘రామ్’ పేరుతో పేదల కడుపు కొడుతూ ‘అన్నమో రామచంద్రా’ అనేలా చేస్తోంది. ‘వికసిత్ భారత్ అంటూ’ పేదల వికాసాన్ని మసి చేస్తోంది. భారత రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని బీజేపీ.. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదాలకు తిలోదకాలిస్తూ నియంతృత్వ పోకడలతో పరిపాలిస్తోంది. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ పేదల కడుపు నింపే లక్ష్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) చట్టాన్ని నీరుగారుస్తూ పేరు మార్చడమే కాకుండా ఇందులో నిబంధలను కూడా మార్చి పేదల కడుపుకొడుతోంది.
మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్-2025’ (వీబీ జీ రామ్ జీ) పథకంగా మార్చింది. పేద ప్రజల పథకం పేరు మార్చడమే కాకుండా దాన్ని లక్ష్యానికి తూట్లు పొడుస్తూ చట్టం ఉద్ధేశ్యాన్ని నీరుగార్చేలా అందులో నిబంధనలు మార్చి ప్రజల కడుపు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్న ఎంజీఎన్ఆర్ఈజీఏతో కాంగ్రెస్కు పేదల్లో ఆదరణ లభించడంతో బీజేపీకి ఈ చట్టంపై అక్కసు పెరిగింది. గాంధీపై, కాంగ్రెస్ పై కోపంతో 20 ఏండ్లుగా పేదలకు అండగా నిలిచిన ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టంలో క్షమించరాని కుట్రలకు పాల్పడింది.
సోనియా గాంధీ ప్రేరణతో వచ్చిన పథకం
అనేక నిబంధలను మార్చడంతో ఉపాధి హామీ చట్టం ఉనికికే ప్రమాదం ఏర్పడింది. 2005లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మార్గదర్శకంలో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం పేదల్లో భరోసా నింపగా నేడు నరేంద్ర మోదీ తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ పథకంతో అభద్రతాబావం ఏర్పడింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఏఉపాధి హామీ చట్టం రూపొందిస్తే ఇప్పుడు చట్టంలో మార్పు చేర్పులు ఆ హక్కుకు భంగం కలిగిస్తున్నాయి.
పని దినాలు పెంచినా..
ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 100 రోజులు పని కల్పించే నిబంధనతో ఆర్థిక సంక్షోభ సమయాల్లోనూ పనులు, డబ్బులు దొరికేవి. కూలీలు డిమాండ్ చేసిన 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పని కల్పించేది. పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలనే నిబంధనతో తప్పనిసరిగా ఉపాధి దొరుకుతుందనే భరోసా వారిలో ఉండేది. 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచిన కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన నిబంధనలు పెట్టింది. వ్యవసాయ పనుల సీజన్లో ఈ పథకం కింద పని చేస్తున్న కూలీలకు కచ్చితంగా 60 రోజుల సెలవులు ఇవ్వాలనే నిబంధన పేదలకు గొడ్డలిపెట్టు.
రాష్ట్రాలపై భారం మోపిన కేంద్రం
మొత్తం మీద దాదాపు 90 శాతం కేంద్రమే భరించే ఈ పథకం వల్ల, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉండేది కాదు. నూతన చట్టం ప్రకారం ఈ పథకానికి అయ్యే ఖర్చు భారంలో 60 శాతం కేంద్రంపై, మరో 40 శాతం రాష్ట్రంపై పడుతోంది. అంతేకాక ఇప్పుడు కేటాయించిన నిధులకు మించి పనులు నిర్వహిస్తే వాటి అదనపు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనే కొత్త నిబంధన పెట్టారు. పాతచట్టం ప్రకారం గ్రామాల్లో అవసరమైన పనులను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి పూర్తి చేసేవి. కొత్త చట్టం సెక్షన్ 5 (1) ప్రకారం ఇకపై పనులను కేంద్రం నిర్ణయించిన గ్రామాల్లోనే చేపట్టాలి. పనులు ముగిసిన 15 రోజుల్లో కూలీలకు వేతనాలివ్వాలనే నిబంధన బాగున్నా, కేంద్రం నిధుల మంజూరులో జాప్యం చేస్తే ఆ భారం రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడడం ఖాయం. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
నరేగా నిధులు బకాయి
ఉపాధి హామీ పథకంపై 2025 డిసెంబర్ 5వ తేదీన పార్లమెంటులోతెలిపిన వివరాల ప్రకారం ‘ఎంజీఎన్ఆర్ఈజీఏ’ కింద దేశవ్యాప్తంగా రూ.9,746.39 కోట్లు కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ. 750 కోట్లకు పైగా కేంద్రమివ్వాలి. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ నిధులను పెండింగ్లో పెడుతుండడంతో ఉపాధి హామీ నిధుల బాకీ కూడా వీటికి జమ అయితే రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలున్నాయి. నూతన చట్టంలోని సెక్షన్ 4(5) ప్రకారం కేంద్రం కార్మికుల పని డిమాండ్ బట్టి కాకుండా రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించనుంది. ఇప్పటికే తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై ఉపాధి హామీ పథకంలో కూడా వివక్ష చూపించే అవకాశాలున్నాయి.
పేదలకు అన్యాయం
‘రాముడి’ పేరుతో ‘మహాత్మా’ గాంధీని అవమానిస్తున్న బీజేపీకి మహాత్మా గాంధీ చివరి నిమిషం వరకూ రామనామ స్మరణే చేశారనే విషయాన్ని విస్మరిస్తోంది. అయితే మహాత్మా గాంధీ రాముడిని నిత్యం కొలిచాడే గానీ తన స్వార్థానికి వాడుకోలేదు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం విలువ తెలుసుకోకుండా రాజకీయాలతో పేదలకు అన్యాయం చేస్తోంది. కొవిడ్ మహమ్మారి సమయంలో పలు దేశాలు ఆకలితో అలమటించిన వేళ భారతదేశంలో పేదలకు ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం ఆపన్న హస్తం అందించిన విషయం మరవకూడదు. పేదల జీవితంలో భాగమైన ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని రాజకీయాలతో నీరుగార్చేందుకు ప్రయత్నించడం క్షమించరాని నేరం. నిత్యం పేదల పక్షాన నిలిచే కాంగ్రెస్ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంపై తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకూ పోరాడుతుంది. ఇప్పటికే ఏఐసీసీ పిలుపు మేరకు నిరసనలు చేపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఇకపై మరింత భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న దశలో ప్రజాస్వామ్యవాదులందరూ అండగా నిలవాలి.
-బి.మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
