
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెట్టుబడులను తెస్తుంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తే బీఆర్ఎస్ దండుపాళ్యం బ్యాచ్ రాబందుల్లా దోచుకున్నదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా నిధులను కొల్లగొట్టి ఖజానాను ఖాళీ చేస్తే.. వారి అవినీతి చిట్టాను ప్రజల ముందు ఉంచే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదన్నారు. తమ అవినీతి బాగోతాలు ఎక్కడ బయటపడుతాయో అనే భయంతో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. రాబోయే రోజుల్లో జనం ఎవరిపై తిరగబడతారో ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే తేలిపోతుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే.. ప్రజలు 6 నెలల్లో తిరగబడతారని కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి, అధికార దాహానికి ని దర్శనమని సుధాకర్ గౌడ్ విమర్శించారు.