ధరణితో కేసీఆర్ ఫ్యామిలీ భూములను దోచుకుంది : కొనగాల మహేశ్

ధరణితో కేసీఆర్ ఫ్యామిలీ భూములను దోచుకుంది : కొనగాల మహేశ్

హైదరాబాద్, వెలుగు: ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం రాష్ర్టమంతా భూములు దోచుకుందని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ ఆరోపించారు. ధరణి ఉద్యోగులు, వారి కుటుంబాలు మాత్రం 11 నెలలు జీతాలు లేక పస్తులున్నారని తెలిపారు. ఆదివారం బేగంపేట టూరిజం ప్లాజాలో ధరణి కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ర్ట కార్యవర్గ సమావేశం నేతలు పురుషోత్తం, శివ, హిమేశ్ ల అధ్యక్షతన జరిగింది. 

ఈ మీటింగ్ లో సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొనగాల మహేశ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి ఉద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం రూ.29వేలు చెల్లిస్తే ఏజెన్సీ మాత్రం ఉద్యోగులకు రూ.12 వేలు మాత్రమే ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో 9 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించామని పేర్కొన్నారు. 

ధరణి రిజిస్ర్టేషన్లు, ప్రజా పాలన అప్లికేషన్ల పరిష్కారం, స్పెషల్ డ్రైవ్ లు ఇలా ఎన్నో డ్యూటీలను చేస్తున్న ఉద్యోగులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఫైర్ అయ్యారు. మహిళా ఉద్యోగులకు మెటర్నటీ లీవ్ లు, చనిపోయిన ఉద్యోగులకు పరిహారం కూడా ఇవ్వలేదని మహేశ్ గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఉద్యోగులకు మహేశ్ హామీ ఇచ్చారు.