పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి జిల్లాల్లో నిరసనలు

పీసీసీ ఆధ్వర్యంలో  ఈ నెల 20 నుంచి జిల్లాల్లో నిరసనలు
  •     ఉపాధి హామీలో ‘గాంధీ’ పేరు తొలగింపునకు వ్యతిరేకంగా ర్యాలీలు 
  •     8న పీసీసీ కార్యవర్గ సమావేశం
  •     ఎజెండాపై అసెంబ్లీలో సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ

హైదరాబాద్, వెలుగు:  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ‘గాంధీ’ పేరును కేంద్రం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ.. పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న గాంధీ భవన్ లో జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించనున్న ఎజెండా అంశాలను ఎంపిక చేసేందుకు సోమవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో వీరిద్దరూ గంటపాటు పలు అంశాలపై చర్చించారు. 

గురువారం జరగనున్న పీసీసీ మీటింగ్ లో ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించాలని వీరు నిర్ణయించారు. ఈ మేరకు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపునకు నిరసనగా ఆందోళనలు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహమే ప్రధాన ఎజెండాగా చర్చ సాగనుంది. డీసీసీల ద్వారా ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో డివిజన్ నుంచి రిజర్వేషన్ల ప్రకారం ఆరుగురు ఆశావహుల పేర్లను పీసీసీకి పంపేందుకు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం, పీసీసీ చీఫ్ చర్చించారు. 

డీసీసీల ప్రతిపాదనల ఆధారంగా ఆ అభ్యర్థులపై సర్వే నిర్వహించి, ఎవరికి మెరుగైన అవకాశాలు ఉంటే వారికే టికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంపై చర్చించుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్ లు, ఇతర పార్టీ నేతల ఒత్తిడి తలొగ్గకుండా సర్వేలే కొలమానంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రజల్లోకి బాగా వెళ్లిందని, ఈ విషయంలో ప్రతిపక్షంపై ప్రభుత్వానిదే పైచేయి అయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.      

పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం అసంతృప్తి

కాంగ్రెస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల 1న ప్రజా భవన్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన పీపీపీల సమావేశానికి కృష్ణా నది పరివాహక జిల్లాలైన నల్గొండ, మహబూబ్ నగర్ కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది గైర్హాజరవడం.. అసెంబ్లీలో ప్రజంటేషన్ సందర్భంగా కూడా సభ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయిన తీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి వారి విషయంలో పార్టీ కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది.