- చైనా మాంజా అమ్మే ఈ-కామర్స్ సైట్లకు నోటీసులు ఇస్తామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా పాలపిట్టలను పంజరాల్లో బంధించి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్) వినయ్ కుమార్ హెచ్చరించారు. రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సోమవారం అరణ్యభవన్‌లో అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాలపిట్టల సంరక్షణ, చైనా మాంజా విక్రయాల కట్టడిపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పాలపిట్టలు గాల్లో ఎగురుతూనే ఆహారం తీసుకుంటాయని, పంజరాల్లో బంధిస్తే తిండి తినలేక చనిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పారు.
గత దసరాకు అక్రమంగా బంధించిన 28 పాలపిట్టలను రక్షించి అడవుల్లో వదిలినట్లు గుర్తుచేశారు. దసరా ఉత్సవాల్లో పాలపిట్టలను ప్రదర్శించకుండా చూడాలని దేవాదాయశాఖను కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతినిధులు పాలపిట్టల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాణాంతకమైన చైనా మాంజా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో గుట్టుచప్పుడు కాకుండా చైనా మాంజా అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్‌జీటీ నిషేధం అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించే ఆన్‌లైన్ సంస్థలకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.
