ప్లాస్టిక్ ఇస్తే.. ఎక్స్చేంజ్‌‌లో కావాల్సిన ఐటమ్‌‌ తీసుకోవచ్చు

ప్లాస్టిక్ ఇస్తే.. ఎక్స్చేంజ్‌‌లో కావాల్సిన ఐటమ్‌‌ తీసుకోవచ్చు

ఎక్కడైనా చాయ్‌‌ తాగాలన్నా, స్నాక్స్‌‌ తినాలన్నా డబ్బులిస్తారు కదా. కానీ ఈ ఊర్లోని బడ్డీ కొట్టుల్లో అలా కాదు. డబ్బులు ఇవ్వాల్సిన పనే లేదు. డబ్బులు బదులు వాడి పడేసిన ప్లాస్టిక్ సామాను ఉంటే చాలు. అవి ఇచ్చి ఎక్స్చేంజ్‌‌లో కావాల్సిన ఐటమ్‌‌ తీసుకోవచ్చు. 

వాటర్ బాటిల్స్‌‌ ఇస్తే టీ, ప్లేట్ శ్నాక్స్‌‌ ఇస్తున్న ఈ హోటల్స్‌‌ పుణేలోని పింప్రి– చించ్‌‌వాడ్‌‌ మునిసిపల్ కార్పొరేషన్‌‌ (పిసిఎమ్‌‌సి)లో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌‌ ప్రారంభించింది కూడా పిసిఎమ్‌‌సినే. జనాల్లో అవగాహన కల్పించేందుకు ‘ప్లాస్టిక్ వేస్ట్‌‌ ఇయ్యండి, వడా పావ్ తిని వెళ్లండి’ అని అడ్వర్టైజ్‌‌మెంట్స్‌‌ ఇచ్చారు. ఐదు ప్లాస్టిక్ బాటిల్స్‌‌ ఇస్తే ఒక కప్పు టీ, పది బాటిల్స్‌‌ అయితే ఒక ప్లేట్‌‌ వడా పావ్‌‌ ఇస్తున్నారు.

కారణం ఏంటంటే...

దేశంలో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. దీంట్లో ముఖ్యంగా వాహనాల నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీల వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ వేస్ట్​ కూడా కాలుష్యానికి కారణం అవుతోంది. పొద్దున పాల ప్యాకెట్ దగ్గరి నుండి రాత్రి ఇంటికి తీసుకెళ్లే సరుకుల వరకు ప్రతి వస్తువులో ప్లాస్టిక్‌‌ ఉంటుంది.

ప్లాస్టిక్ భూమిలో కలసిపోవడానికి కొన్ని వందల ఏండ్లు పడుతుంది. ప్లాస్టిక్‌‌ను కాలిస్తే వచ్చే పొగ పర్యావరణానికి చాలా ప్రమాదం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఎన్నో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా ఇప్పటికీ చాలామందిలో మార్పు రావట్లేదు. స్వచ్ఛ భారత్‌‌ కోసం ఇంటింటికి చెత్తబుట్టలు ఇచ్చినా, వీధుల్లో చెత్తకుండీలు ఏర్పాటు చేసినా ఏం లాభం లేకుండా పోతోంది. నాలాలు, కెనాల్స్ చెత్తతో నిండిపోతున్నాయి. దీంతో రకరకాల ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. అందుకే ‘పుణే’ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలని పిసిఎమ్‌‌సి అధికారులు ఈ వినూత్న కార్యక్రమం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మొదటగా పుణే పరిధిలో మూడు స్టాల్స్‌‌ను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ బాటిల్స్ ఇచ్చి వడపావ్‌‌ తీసుకోండని ప్రచారం చేశారు. దీంతో చాలామంది రోజూ ప్లాస్టిక్ వేస్ట్‌‌ను తీసుకొచ్చి వడా పావ్, టీ తీసుకెళ్తున్నారు.  

దీనికోసం పిసిఎమ్‌‌సినే నిధులు సమకూరుస్తుంది. స్టాల్స్ నడుపుతున్న వాళ్లకు నెల నెలా ఒక కప్పు టీకి 10 రూపాయలు, ఒక వడా పావ్‌‌కు 15 రూపాయలు ఇస్తున్నారు. అలా వచ్చిన ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌ను మోషి గార్బేజ్‌‌ డిపోలో సేకరించి ఫ్యూయల్‌‌, ఇండస్ట్రియల్‌‌ ఆయిల్‌‌ తయారుచేస్తున్నారు.

సమాధానాలు చెప్తూ... 

ఈ ప్రోగ్రామ్‌‌ సక్సెస్‌‌ అయింది అనేలోపే ‘స్ట్రీట్‌‌ సైడ్‌‌ ఫుడ్‌‌ను ఎలా తింటారు? ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడతారు. కల్తీ చేస్తారు. వాళ్లకు ఎలాంటి లైసెన్స్ ఉంది? రోడ్ సైడ్‌‌ ఫుడ్ కాబట్టి హైజీన్ ఎలా? ఇవి తిని ప్రజల ఆరోగ్యం పాడుచేసుకోవాలా?’ అని సుషీల్ మంచర్‌‌‌‌కార్‌‌‌‌ అనే లాయర్​ కోర్టులో కేసు వేశాడు. దానికి సమాధానంగా ‘మేము ఫుడ్‌‌ లైసెన్స్ ఉన్నవాళ్లనే ఈ ప్రోగ్రామ్‌‌లో తీసుకున్నాం. కావాల్సినవన్నీ ఉన్నాయో, లేదో చూసాకే వాళ్లను అనుమతిస్తున్నాం. హైజీన్, ఫుడ్‌‌ క్వాలిటీ తెలుసుకోవడానికి ఒక టీం ఏర్పాటు చేశాం. వాళ్లు ఎప్పటికప్పుడు రిపోర్ట్‌‌ ఇస్తారు’ అని పిసిఎమ్‌‌సి చెప్పింది.

‘ఈ రోజుల్లో అతిపెద్ద పర్యావరణ సమస్యల్లో ఒకటి ప్లాస్టిక్‌‌ వినియోగం. సందుల్లో, మురికి కాలువల్లో, రోడ్ల పక్కన ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతోంది. రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వేస్ట్ వస్తున్నా, రీసైకిల్ మాత్రం పూర్తి స్థాయిలో జరగడం లేదు. ప్లాస్టిక్ బాటిల్స్‌‌ను కొనేవాళ్లు తగ్గిపోయారు. 
అందుకే ఈ ప్రోగ్రామ్‌‌ను మొదలు పెట్టాం. ఎవరైనా దీంట్లో భాగస్వాములు కావచ్చు. కాకపోతే హోటల్‌‌ లైసెన్స్‌‌ ఉండాలి’ అని పిసిఎమ్‌‌సి ఆఫీసర్ డాక్టర్‌‌‌‌ రాయ్‌‌ చెప్పాడు.