ఆయన బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్ : సీఎం రేవంత్  

ఆయన బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్ : సీఎం రేవంత్  

బీజేపీ, బీఆర్ఎస్ మాట్లాడుకొని గూడుపుఠాణి చేశాయని, కేసీఆర్​కు చెప్పే బీబీ పాటిల్ బీజేపీలో చేరారని రేవంత్ రెడ్డి అన్నారు. బిడ్డకు బెయిల్ రావాలంటే జహీరాబాద్ లోక్​సభ స్థానంలో బీజేపీని గెలిపించాలని ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అంగీ, టోపీ మారింది కానీ బీబీ పాటిల్ బుద్ధి మారలేదన్నారు. ఆయన ముఖానికి మసి పూసుకొని వచ్చినా బిజినెస్ పాటిల్ అని జనం గుర్తు పడతారన్నారు. ‘‘బీబీ పాటిల్ పదేండ్లు మీ ఎంపీగా ఉండి లోక్​సభ​లో మీ సమస్యల గురించి ఒక్కనాడైనా మాట్లాడారా?’’ అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బీసీల జనాభా లెక్కలు తేల్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. తెలంగాణ పదేండ్లపాటు కల్వకుంట కుటుంబ పాలనలో బందీ అయిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తెలంగాణ దొరల గడీని బద్దలుకొట్టి రాష్ట్రానికి స్వేచ్ఛను ప్రసాదించారన్నారు. తాము100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు. నీతి, నిజాయతీ ఉన్న సురేశ్​ షెట్కార్​ను జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలన్నారు.