
- షేరుకి రూ.125 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ల్ (క్యూ4) లో రూ.3,877.8 కోట్ల నికర లాభం వచ్చింది. ఇది కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.2,623.6 కోట్లతో పోలిస్తే 47.8 శాతం, డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.3,130 కోట్లతో పోలిస్తే 23.89 శాతం ఎక్కువ. కంపెనీ రెవెన్యూ క్యూ4 లో రూ. 38,234.9 కోట్లకు పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.32,048 కోట్ల నుంచి 19.3 శాతం వృద్ధి చెందింది.
డిసెంబర్ క్వార్టర్‌లో రూ.33,308.7 కోట్ల రెవెన్యూని మారుతి సుజుకీ ప్రకటించింది. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకుంటే రూ.13,209.4 కోట్ల నికర లాభాన్ని, రూ.1.41 లక్షల కోట్ల రెవెన్యూని మారుతి సాధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.8,049.2 కోట్ల ప్రాఫిట్, రూ. 1.18 లక్షల కోట్ల రెవెన్యూని ప్రకటించింది. షేరుకి రూ.125 డివిడెండ్‌ను బోర్డ్ ప్రపోజ్ చేసింది.
మారుతి సుజుకీ షేర్లు శుక్రవారం 1.26 శాతం తగ్గి రూ. 12,760 దగ్గర సెటిలయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21,35,323 బండ్లను మారుతి సుజుకీ అమ్మింది. ఇందులో 18,52,256 బండ్లను ఇండియాలో అమ్మగా, 2,83,067 బండ్లను ఎగుమతి చేయగలిగింది. కంపెనీ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 8.6 శాతం వృద్ధి చెందాయి. మార్చి క్వార్టర్‌లో మారుతి సుజుకీ 5,84,031 బండ్లను అమ్మగలిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 13.4 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఏడాదిలో 20 లక్షల బండ్ల సేల్స్ మార్క్‌ను మొదటిసారిగా 2023–24 లో చేరుకున్నామని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.