ఇన్కమ్ రీప్లేస్మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ తెలుసా..? ఫ్యామిలీకి ఇది ఎంత అవసరమో తెలుసుకోండి..

ఇన్కమ్ రీప్లేస్మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ తెలుసా..? ఫ్యామిలీకి ఇది ఎంత అవసరమో తెలుసుకోండి..

ఇన్కమ్ రీప్లేస్మెంట్ టర్మ్ ప్లాన్ అనేది ఒక ప్రత్యేకమైన లైఫ్ ఇన్సూరెన్స్ విధానం. సాధారణ టర్మ్ ఇన్సూరెన్స్‌లో పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. కానీ ఈ ప్లాన్‌లో.. ఆ మొత్తం డబ్బుతో పాటు లేదా దానికి బదులుగా, కుటుంబానికి ప్రతి నెలా కొంత ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అంటే ఇంటి పెద్ద లేకపోయినా.. ఆయన జీతం లేదా ఆదాయం ప్రతి నెలా భర్తీ చేసే విధంగా ఈ ప్లాన్ రూపొందించబడింది.

ఒకేసారి కోటి రూపాయలు చేతికి వస్తే.. ఆ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలి లేదా ఎలా ఖర్చు చేయాలి అనేది చాలా కుటుంబాలకు తెలియకపోవచ్చు. తప్పుడు నిర్ణయాల వల్ల ఆ డబ్బు త్వరగా ఖర్చయ్యే ప్రమాదం ఉంటుంది. ఇన్కమ్ రీప్లేస్మెంట్ ప్లాన్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇది కుటుంబానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని అందిస్తూ.. నిత్యావసర ఖర్చులు, ఇంటి అద్దె, ఇతర బిల్లుల చెల్లింపులకు భరోసా ఇస్తుంది. తద్వారా కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా స్థిరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు.

మారుతున్న కాలంతో పాటు ద్రవ్యోల్బణం కారణంగా వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కొన్ని ప్లాన్లలో ప్రతి సంవత్సరం నెలవారీ ఆదాయాన్ని నిర్ణీత శాతం (ఉదాహరణకు 5% నుండి 10%) పెంచే సదుపాయం కూడా ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో పెరిగే ఖర్చులను కూడా కుటుంబం తట్టుకోగలుగుతుంది. పిల్లల చదువులు, ఇతర దీర్ఘకాలిక అవసరాలకు ఈ పెరిగిన ఆదాయం ఎంతో తోడ్పడుతుంది.

ALSO READ :  వైట్ కాలర్ ఉద్యోగులకు బ్యాడ్ టైం..

ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబానికి, పెద్ద మొత్తంలో వచ్చే నగదును నిర్వహించడం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. బంధువుల ఒత్తిడి లేదా మోసపూరిత పెట్టుబడి పథకాల వల్ల ఆ డబ్బు వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ రీప్లేస్మెంట్ ప్లాన్ ద్వారా నెలనెలా డబ్బు రావడం వల్ల అటువంటి రిస్క్ ఉండదు. కుటుంబ సభ్యులు వేరే ఎవరిపైనా ఆధారపడకుండా.. తమ సొంత కాళ్లపై నిలబడగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్లాన్ అందిస్తుంది.

ఈ ప్లాన్లు సాధారణంగా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని అందిస్తాయి. పాలసీదారుడు తన అవసరానికి అనుగుణంగా ఎంత శాతం డబ్బు ఒకేసారి కావాలి, ఎంత శాతం నెలవారీ ఆదాయంగా రావాలి అనేది ముందే నిర్ణయించుకోవచ్చు. దీనితో పాటు.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C ప్రకారం చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే నామినీకి అందే డెత్ బెనిఫిట్ మొత్తం కూడా సెక్షన్ 10(10D) కింద పన్ను రహితంగా ఉంటుంది.

మీ కుటుంబ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుండి 15 రెట్లు ఉండేలా ఇన్సూరెన్స్ మెుత్తాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఇది మీరు లేని లోటును ఆర్థికంగా భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది కుటుంబానికి అత్యంత కష్టకాలంలో.