Reliance AI Roadmap: మానవ చరిత్రలో ఏఐ ఒక అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక విప్లవమని రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అభివర్ణించారు. రిలయన్స్ సంస్థను కేవలం ఒక వ్యాపార దిగ్గజంగానే కాకుండా.. "AI-నేటివ్ డీప్-టెక్" కంపెనీగా మార్చే లక్ష్యంతో ఆయన ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు. "ప్రతి భారతీయుడికి అందుబాటు ధరలో ఏఐ" అనే నినాదంతో.. దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుల జీవనశైలిని సమూలంగా మార్చడమే రిలయన్స్ ప్రధాన సంకల్పమని అంబానీ స్పష్టం చేశారు.
ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది.. రిలయన్స్ అంతర్గత పనితీరును ఏఐ ఆధారితంగా మార్చడం. సంస్థలోని సేల్స్, సప్లై చైన్, రిక్రూట్మెంట్స్, తయారీ రంగాల్లో మానవ శ్రమను తగ్గించి.. నిర్ణయాలు వేగంగా తీసుకునేలా ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టనున్నారు. డేటా ఆధారంగా.. పారదర్శకమైన పాలనతో పనులను వేగవంతం చేస్తూనే, మానవ జవాబుదారీతనాన్ని కాపాడుతామని అంబానీ పేర్కొన్నారు. ఇందుకోసం చిన్న చిన్న 'పాడ్స్' ఏర్పాటు చేసి, ప్రయోగాత్మక పద్ధతుల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని నిర్ణయించారు.
Also Read : వైట్ కాలర్ ఉద్యోగులకు బ్యాడ్ టైం.. 2026 నుంచి భారీ లేఆఫ్స్, ఏఐ గాడ్‌ఫాదర్ హెచ్చరిక
రెండవ అంశం.. భారతదేశ సమగ్ర ఏఐ పరివర్తనలో రిలయన్స్ పాత్ర. జియోకున్న 50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, రిటైల్ నెట్‌వర్క్, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి విభాగాలను ఏఐతో అనుసంధానం చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీ, రోబోటిక్స్, మెటీరియల్స్ లాంటి రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించేలా ఏఐని వినియోగిస్తామన్నారు అంబానీ. ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధిలో "కేరింగ్ ఏఐ" వ్యవస్థలను తీసుకురావడం ద్వారా సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు
ఈ మెగా ప్లాన్ గురించి రిలయన్స్ ఉద్యోగుల నుంచి సలహాలను సూచనలను జనవరి 10 నుంచి 26 వరకు సేకరించనున్నారు. ఈ మేనిఫెస్టో కేవలం ఒక పత్రం మాత్రమే కాదని.. అది 'న్యూ ఇండియా', 'న్యూ రిలయన్స్' నిర్మాణానికి ఒక నిబద్ధత అని అంబానీ పిలుపునిచ్చారు. టెక్నాలజీని విజ్ఞతతో ఉపయోగిస్తే మానవాళి ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ముఖేష్ అంబానీ.
