పాలమూరుకు నిధులు తెస్త..చేవెళ్ల అభివృద్ధికి  కృషి చేస్తా:కొండా విశ్వేశ్వర్ రెడ్డి

పాలమూరుకు నిధులు తెస్త..చేవెళ్ల అభివృద్ధికి  కృషి చేస్తా:కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల ప్రాంతానికి సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులు తీసుకొస్తానని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆ నిధులతో కృష్ణా జలాలను జూరాల నుంచి నేరుగా తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు మళ్లించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని రద్దుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి ఎలాంటి లాభం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని బీజేపీ ఆఫీసులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను గెలిపిస్తే చేవెళ్ల నియోజకవర్గంలో రాబోయే ఐదేండ్లలో చేయనున్న పనులపై  ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి.. సంకల్ప పత్రం పేరిట విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అభివృద్ధికి తన సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. 

నిరుద్యోగులకు ఉద్యోగాలు.. 

అత్యంత వైవిధ్యం కలిగిన చేవెళ్ల నియోజకవర్గంలో 29 లక్షల మంది విభిన్న కులాలు, మతాలు, భాషల వారు ఉన్నారని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎంపీగా ఈ ప్రాంతానికి విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లు, ఆస్పత్రుల విషయంలో నియంత్రణ చర్యలు చేపడతానన్నారు. గోవా తరహాలో కమ్యూనిటీ స్కూల్స్ తీసుకొచ్చి అధిక ఫీజుల భారం లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. చేవెళ్ల ప్రాంత యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగాన్ని రూపు మాపేందుకు, భారీ పెట్టుబడులు తీసుకురావడమే  కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఆర్థికంగా బలోపేతం 
చేస్తానన్నారు.