టెంపుల్‌‌‌‌‌‌‌‌ టౌన్స్‌‌‌‌‌‌‌‌లో  కాంగ్రెస్ హవా.. యాదగిరిగుట్ట, వేములవాడ మున్సిపాల్టీస్ హస్తం కైవసం

టెంపుల్‌‌‌‌‌‌‌‌ టౌన్స్‌‌‌‌‌‌‌‌లో  కాంగ్రెస్ హవా.. యాదగిరిగుట్ట, వేములవాడ మున్సిపాల్టీస్ హస్తం కైవసం
  • యాదగిరిగుట్టలో 12కు ఎనిమిది స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌
  • వేములవాడలో 13 వార్డులు హస్తగతం
  • ఇండిపెండెంట్లు, ఎక్స్‌‌‌‌‌‌‌‌అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేములవాడ

యాదగిరిగుట్ట/వేములవాడ, వెలుగు : రాష్ట్రంలో పేరుగాంచిన యాదగిరిగుట్ట, వేములవాడ మున్సిపాలిటీలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో పడ్డాయి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మరోసారి హస్తం హవానే కొనసాగింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీకి 2020లో తొలిసారి ఎన్నికలు జరుగగా... కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, సీపీఐ కలిసి ఏడు స్థానాలు గెలుచుకున్నాయి.

అప్పుడు నాలుగు వార్డుల్లోనే గెలిచిన బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌.. ఓ ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌, మూడు ఎక్స్‌‌‌‌‌‌‌‌అఫీషియో ఓట్లతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ పీఠాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఎన్నికలకు ముందే ఒక వార్డును ఏకగ్రీవంగా దక్కించుకుంది. మరో 10 వార్డుల్లో పోటీ చేసి 7 గెలువగా, సీపీఐ ఒక స్థానంలో విజయం సాధించింది.

దీంతో కాంగ్రెస్ కూటమి తొమ్మిది స్థానాలను‌‌‌‌‌‌‌‌ తన ఖాతాలో వేసుకొని చైర్మన్‌‌‌‌‌‌‌‌ పీఠాన్ని దక్కించుకుంది. మరో వైపు బీజేపీ రెండు స్థానాల్లో గెలిచి బోణీ కొట్టగా.. ఐదేండ్లు మున్సిపల్ పీఠంపై కూర్చున్న బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. 

వేములవాడలో...

వేములవాడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో చేరింది. వేములవాడ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరుగగా.. మొదటిసారి బీజేపీ, రెండోసారి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గెలిచాయి. ముచ్చటగా మూడోసారి జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఈ సారి చైర్మన్‌‌‌‌‌‌‌‌ పీఠం దక్కించుకోనుంది. 

వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా.. ఇందులో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 13 స్థానాల్లో గెలువగా.. బీజేపీ 8, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 5, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇందులో ఇద్దరు ఇండిపెండెంట్లు, ఓ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇస్తూ క్యాంప్‌‌‌‌‌‌‌‌కు వెళ్లినట్లు తెలిసింది. 

వీరితో పాటు ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ బలం 17కు చేరే అవకాశం ఉంది. దీంతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ పీఠం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.