బిహార్ దోపిడీ గ్యాంగ్పై పీడీ యాక్ట్

బిహార్ దోపిడీ గ్యాంగ్పై పీడీ యాక్ట్

గచ్చిబౌలి, వెలుగు : చందానగర్ జాతీయ రహదారిపై ఉన్న ఖజానా జువెలరీ షాపులో తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ ఐదుగురు అంతరాష్ట్ర దొంగలపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ వెల్లడించారు. 2025 ఆగస్టు 12న ఉదయం షాపు తెరవగానే ముఖాలకు మాస్కులు ధరించి లోపలికి చొరబడిన ఈ ముఠా.. సిబ్బందిని ఆయుధాలతో భయభ్రాంతులకు గురిచేసి బంగారు పూత పూసిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

ఈ కేసులో బిహార్​కు చెందిన ప్రధాన నిందితుడు అభిషేక్ పాండేతో పాటు ప్రదుమాన్ కుమార్ సింగ్, ఆశిశ్ కుమార్ సింగ్, రోహిత్ కుమార్, శివం పాండేను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి తుపాకులు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు జువెలరీ షాపుల్లో రెక్కీ నిర్వహించి పదే పదే నేరాలకు పాల్పడుతుండటంతో, సమాజ భద్రత దృష్ట్యా ఈ ఐదుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ సీపీ రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

చెల్లూరి చంటిపై కూడా..

అలాగే సినిమా అవకాశాలు, ఉద్యోగాల పేరుతో మహిళలను నమ్మించి వ్యభిచారంలోకి దింపుతున్న అంతరాష్ట్ర నిందితుడు చెల్లూరి చంటి అలియాస్ చోటుపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏపీకి చెందిన చంటి.. నగరంలో ఇళ్లను అద్దెకు తీసుకొని వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నాడు. 2023 నుంచి 2025 వరకు ఆరు మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పదే పదే నేరాలకు పాల్పడుతుండటంతో సీపీ ఈ ఉత్తర్వులు జారీ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.