వరంగల్, వెలుగు: విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలని పీడీఎస్‍యూ నేతలు డిమాండ్చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‍వీ శ్రీకాంత్ అధ్యక్షతన హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్క్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వరరావు, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి.సంధ్య మాట్లాడారు.
ఐదు దశాబ్దాలుగా పీడీఎస్‍యూ విద్యార్థుల గొంతుకగా సమరశీల పోరాటలతో విద్యార్థుల హక్కుల కోసం పని చేస్తోందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యం స్వదేశీ జపం చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతోందని విమర్శించారు.
విదేశీ, ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోందన్నారు. దేశంలోని విద్యార్థులందరికీ సమాన విద్య అందినప్పుడే సమాజం పురోగతి చెందుతుందన్నారు. సంఘం నేతలు పొడపంగి నాగరాజు, ఎం.శ్రీనివాస్, సౌరవ్, ధీరజ్, కె.భాస్కర్, ఎం.వినోద్, భువనగిరి మధు, జన్నారపు రాజేశ్వర్, డి.శ్రీకాంత్, మంద నవీన్, సంతోష్, గౌతమ్, మస్తాన్ పాల్గొన్నారు.
