హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి పేరును పెద్దపల్లి జిల్లాకు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఏడుసార్లు పార్లమెంట్ సభ్యులుగా, నాలుగు సార్లు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్ గా పనిచేసి పేదలకు సేవ చేసిన గొప్ప నేత కాకా వెంకటస్వామి అని ఆయన గుర్తు చేశారు. గరీబోళ్ల కు నిలువ నీడ కావాలని పోరాడి పేదలకు ఇంటి నివాసాలు సాధించి పెట్టి ఇంటి పేరుని మార్చుకొని గుడిసెల వెంకటస్వామిగా వెలుగొందారన్నారు.
కాక 97వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జాజుల ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం పూలమాలవేసి నివాళులర్పించారు. దళిత బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన గడ్డం వెంకటస్వామి పేరును రాష్ట్ర ప్రభుత్వం చిరస్థాయిగా నిలబెట్టాలంటే పెద్దపెల్లి జిల్లాకు వారి పేరు పెట్టాలని, కాక జీవితం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కాకా ఆశయ సాధన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ కలిసికట్టుగా పోరాడాలని జాజుల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు శ్యాంకుర్మా, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్, సైదులు పాల్గొన్నారు.
