- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలో దారి మైసమ్మ గుడులను కూల్చడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆలయాలను ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కూల్చిన చోటే గుడులను తిరిగి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
దారి మైసమ్మ గుడులను కూల్చివేతకు నేతృత్వం వహించిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేరుగు హన్మంత్‌గౌడ్, జిల్లా కార్యదర్శి కోమళ్ల మహేశ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ కుమార్ డిమాండ్‌చేశారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిని వదిలిపెట్టబోమని, హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
దారి మైసమ్మ గుడుల కూల్చివేతపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనుచరులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్లే మున్సిపల్ అధికారులు పని చేస్తున్నారని, అలాంటప్పుడు అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్లీడర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూల్చిన స్థలాల్లోనే గుడులను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో హోమం
గోదావరిఖని ఆటో యూనియన్ అడ్డా వద్ద గల మైసమ్మ గుడి ఆవరణలో శనివారం ఉదయం కోదండ రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేశ్ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ ఫ్లోర్‌లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. గుడుల కూల్చివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ కలెక్టర్‌ను కోరారని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.
