పెద్దవాగు సమస్యను ఇరురాష్ట్రాల దృష్టికి తీసుకెళ్తా: బండి సంజయ్​

పెద్దవాగు సమస్యను ఇరురాష్ట్రాల దృష్టికి తీసుకెళ్తా:  బండి సంజయ్​

     శాశ్వత పరిష్కారం లభించేలా ప్రయత్నిస్తా: బండి సంజయ్​
    బాధితులకు ఫోన్​లో భరోసా కల్పించిన కేంద్ర మంత్రి

హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​తెలిపారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో వరదల్లో చిక్కుకొని, ఎన్డీఆర్ఎఫ్​ సిబ్బంది సహాయంతో బయటపడ్డ నారాయణపురం గ్రామస్తులతో సంజయ్​ఆదివారం ఫోన్​లో మాట్లాడారు.  ప్రాజెక్టు కొట్టుకుపోవడంవల్ల జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రావడంవల్లే తాము బతికి బయటపడ్డామని, కేంద్ర ప్రభుత్వానికి, హోం మంత్రి అమిత్ షా, బండి సంజయ్ కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. 

పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణ లోపం, సిబ్బంది కొరతవల్లే ఈ నష్టం వాటిల్లిందని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే తెలంగాణ పరిధిలో ఉందని, ఈ వాగు పరిధిలోని దాదాపు 16 వేల ఆయకట్టు పూర్తిగా ఏపీలో ఉండడంతో దీన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చెప్పారు.  తక్షణమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు.  ఈ సందర్భంగా బండి సంజయ్​ మాట్లాడుతూ.. పెద్దవాగు ప్రాజెక్టు వరద ఉధృతితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపారని తెలిపారు. 

ప్రజలు భయాందోళనలకు లోనుకాకుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి పూర్తిగా సహకరించడంవల్లే సురక్షిత ప్రాంతాలకుతరలించగలిగారని చెప్పారు. ఈ విషయంలో జిల్లా, రాష్ట్ర యంత్రాంగం బాగా పనిచేసిందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ బాధితులందరినీ ఒకేచోట చేర్చి.. బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడించారు.