
రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ యాక్షన్ డ్రామాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ గురువారం (అక్టోబర్ 09) పూణెలో మొదలవుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటపై ఓ పాటను చిత్రీకరించనున్నారు.
మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ పాటను కంపోజ్ చేసినట్టు సమాచారం. జానీ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ సాంగ్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే అరవై శాతం వరకూ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైమల్టేనియస్‌గా జరుగుతున్నాయి.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుండగా జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.