
హైదరాబాద్, వెలుగు: ఏఐ, ఆటోమేషన్‌లో ప్రతిభను పెంపొందించేందుకు పెగా సిస్టమ్స్, స్మార్ట్‌బ్రిడ్జ్ చేతులు కలిపాయి. హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్‌బ్రిడ్జ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ భాగస్వామ్యం విద్యార్థులకు అవసరమైన టెక్నికల్ స్కిల్స్ అందించనుంది. ఈ సందర్భంగా పెగా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ పెగా యూనివర్సిటీ అకడమిక్ ప్రోగ్రామ్ (యూఏపీ) ద్వారా స్టూడెంట్లు అత్యాధునిక టెక్నాలజీలను నేర్చుకోవచ్చన్నారు.
ఈ ప్రోగ్రామ్ కింద 200 గంటలకు పైగా శిక్షణ, యూనివర్సిటీ క్రెడిట్ కోర్సులు, గ్లోబల్ పెగా సర్టిఫికేషన్లు అందించనున్నామని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని భారతదేశంతో పాటు ఆసియా - పసిఫిక్, మిడిల్ ఈస్ట్ దేశాలలో కూడా అమలు చేయనున్నామని ఆయన వివరించారు. దీంతో గ్లోబల్ కంపెనీలకు అవసరమైన డిజిటల్ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అందుబాటులోకి వస్తారని దీపక్ పేర్కొన్నారు.