హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కమిషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వివిధ కారణాలతో మూడు నెలలుగా 33 జిల్లాలకు రేషన్ కమిషన్ పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రంతో చర్చలు జరిపి నిధుల విడుదలకు కృషి చేశారు. ఈ మేరకు డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. 33 జిల్లాల్లో 27 జిల్లాలకు సంబంధించి డిసెంబర్ నెల వరకు రేషన్ డీలర్లకు కమిషన్ అందాయి.
సూర్యాపేట, ఆదిలాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు రావాల్సిన 5 నెలల కమిషన్‌ను వివిధ కారణాలతో పెండింగ్ పడింది. ఈ నెల 12లోగా ఇవి కూడా క్లియర్ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ప్రతి నెల రూ.25.40 కోట్లను కమిషన్ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 వేల మందికి పైగా రేషన్ డీలర్లు రేషన్ పంపిణీ చేస్తుండగా, క్వింటాల్‌కు రూ.140 చొప్పున కమిషన్ చెల్లిస్తున్నారు.
