పంజాగుట్ట, వెలుగు: పెంగ్విన్ సంస్థ అధిక వడ్డీ పేరుతో పెట్టుబడులు స్వీకరించి సుమారు రూ.150 కోట్ల మేర మోసం చేసిందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థలో పెట్టుబడులు పెడితే స్వల్పకాలంలో అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపించి మోసానికి పాల్పడ్డారని అన్నారు.
సంస్థలో పెట్టుబడులు పెట్టిన కొందరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రస్తుతం న్యాయం కోసం వారి కుటుంబాలు పోరాటం చేస్తున్నాయని తెలిపారు. పెంగ్విన్ సంస్థ నిర్వాహకులు వాడేకర్ బాలాజీ, చౌదరి స్వాతి ముఖం చాటేశారని ఆరోపించారు. ప్రస్తుతం పెంగ్విన్ సంస్థ బాధితులు సుమారు 300 మంది ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో బాధితులు దీక్ష, విమల, లలిత, మురళీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
