అసంపూర్తిగా ఎస్ఎన్టీపీ పనులు..వానొస్తే వణికిపోతున్న జనం

అసంపూర్తిగా ఎస్ఎన్టీపీ పనులు..వానొస్తే వణికిపోతున్న జనం
  • రెండేళ్లుగా కొనసాగుతున్న ఎస్ఎన్డీపీ పనులు
  • చినుకు పడితే వణికిపోతున్న ముంపు ప్రాంతాల వాసులు
  • ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి
  • భారీ వర్షం కురిస్తే పొంచి ఉన్న ప్రమాదం

ఎల్ బీనగర్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఎస్ఎన్డీపీ(స్ట్రాటజిక్​ నాలా డెవలప్​మెంట్ ప్రోగ్రామ్) పనులు పూర్తికాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో డేంజర్​బెల్స్ మోగుతున్నాయి. ఓ వైపు సిటీలో రోజూ వాన పడుతుండడంతో ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనని జనం వణికిపోతున్నారు. ఇండ్ల ముందు నత్తనడకన కొనసాగుతున్న బాక్స్​ డ్రెయిన్​ నిర్మాణాలను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే రోడ్లపై నీళ్లు పారి సగం సగం పూర్తయిన డ్రెయిన్లు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ముంపు ప్రాంతాల్లోని జనం ఇండ్లలో ఉండలేరు.. అలా అని బయటికి రాలేరు. గతంలో మాదిరి వరద ముంచెత్తితే సిటీలోని చాలా ప్రాంతాల్లో ప్రాణనష్టం భారీగా జరిగే అవకాశం ఉందని ముంపు కాలనీల వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

2020 అక్టోబరులో సిటీని వరద ముంచెత్తిన టైంలో ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వం ఎస్ఎన్డీపీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆరు నెలల్లో నాలాలను అభివృద్ధి చేసి ముంపు సమస్యను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. రూ.735కోట్లతో 37చోట్ల నాలాల అభివృద్ధి చేపట్టారు. ఇందులో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 8, ఎల్ బీనగర్ లో11, కూకట్​పల్లిలో 3, చార్మినార్ లో 6, ఖైరతాబాద్ లో 7, శేరిలింగంపల్లి జోన్​పరిధిలో 2 పనులు చేట్టారు. 

ఎక్కడా 100 శాతం కాలే

పనులు మొదలు పెట్టి దాదాపుగా రెండేండ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఒక్కచోట కూడా పనులు పూర్తిస్థాయిలో కాలేదు. కొన్నిచోట్ల సగం కూడా కాలేదు. మరికొన్నిచోట్ల బిల్లులు రిలీజ్​కాక చివరి దశకు వచ్చి ఆగిపోయాయి. గత రెండేళ్లలో వరదలతో 29 మంది చనిపోయారు. సరూర్​నగర్​లో హరీశ్​అనే యువకుడు నాలా పైకప్పు లేక గల్లంతయ్యాడు. తర్వాత డెడ్​బాడీ దొరికింది. నాగోలులో ఓ పోస్ట్ మన్, సరూర్ నగర్ కోదండరాం నగర్ కాలనీలో వృద్ధురాలు, బోరబండ సాయిబాబా టెంపుల్ సమీపంలో ఒకరు, మణికొండలో సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్, కుత్బుల్లాపూర్​గణేశ్​టవర్స్​సమీపంలో ఒకరు, మల్కాజ్ గిరిలో మరొకరు ఇలా చాలా మంది గల్లంతై చివరికి మృతదేహాలు దొరికాయి. అప్పుడు డ్రైనేజీలపై మూతలు లేక, మ్యాన్​హోళ్లు తెరిచి ఉంచి, నీట మునిగి ఇలా రకరకాల కారణాలతో మృతి చెందారు. కానీ ఈసారి వరద ముంచెత్తితే పూర్తికాని బాక్స్ డ్రెయిన్​పనులతో ప్రమాద తీవ్రత ఏ రేంజ్​లో ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇనుప చువ్వులు కట్టి వదిలేసిన గుంతలు పొంచి ఉన్న ప్రమాదానికి అద్దం పడుతున్నాయి. ఓల్డ్ సిటీతోపాటు ఎల్ బీనగర్ జోన్ పరిధిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. వానల భయంతో పనులు పెండింగ్ ఉన్న చోట కనీసం రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాద బోర్డులు పెట్టాలని, నాలా సైడ్ వాల్స్​ పూర్తయిన చోట మట్టితో పూడ్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ముందస్తు చర్యలు తీస్కుంటున్నం

బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. వరద వస్తే డ్రైయిన్​గుంతల్లో పడిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.
- ఎ.కృష్ణయ్య, ఎస్ఎన్డీపీ ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్


బయట అడుగు పెడితే తిరిగి వస్తమో లేదో?

మాది ముంపు ప్రాంతాల్లోని ఓ కాలనీ. గతంలో వరదలు వచ్చినప్పుడు కాలనీ వ్యక్తి బయటికి వెళ్లి గల్లంతయ్యాడు. తర్వాత అతని డెడ్​బాడీ దొరికింది. వాన పడినప్పుడు బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. సగం తవ్వి వదిలేసిన డ్రైయిన్​పనులు మరింత భయపెడుతున్నాయి. మంత్రి కేటీఆర్ వచ్చి ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని మాటిచ్చారు. కానీ ఆ మాట చెప్పి రెండేళ్లు అవుతుంది.ఈసారి కూడా ముంపు తప్పేటట్లు లేదు.
- ఆనంద్, జనప్రియ కాలనీ, సరూర్ నగర్