
మియాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిని హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు,హెచ్ఎండీఏ అధికారులపై రాళ్ళు, కర్రలతో దాడికి పాల్పడ్డారు ప్రజలు. హెచ్ఎండీఏ అధికారి రఘుకి స్వల్ప గాయాలయ్యాయి. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కబ్జాదారులు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. భూ కబ్జాదారులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
మియాపూర్ 100,101సర్వే నంబర్ లోని దాదాపు 504 ఎకరాల్లో గుడిసెలు వేశారు ప్రజలు. ఘటనాస్థలానికి పెద్దఎత్తున పోలీసులు చేరుకున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండీఏ అధికారులు. ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు ఖాళీచేయకపోతే పీడీయాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు. సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వభూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు. పేదలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు.అయితే ప్రజలు గుడిసెలు తీసేందుకు నిరాకరించారు. దీంతో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.