
లాక్డౌన్ వల్ల ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లడానికి వాహనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎలాగైనా సరే తమ ఊరు చేరాలనే కోరికతో.. అడ్డదారులు తొక్కుతున్నారు. అలా అడ్డదారిలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లడానికి ప్రయత్నించి కొంతమంది పోలీసులకు చిక్కారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించడానికి నది ద్వారా నాటు పడవలో బయలుదేరిన వారిని గురజాల రూరల్ సిఐ ఉమేష్ అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని వాడవల్లి గ్రామం నుంచి కృష్ణా నది ద్వారా ఆంధ్ర ప్రదేశ్ పొందుగలలోకి ప్రవేశించుటకు కొంతమంది ప్రయత్నించారు. దీనికి సంబంధించి గురజాల రూరల్ సీఐకి విశ్వసనీయ సమాచారం రావడంతో స్వయంగా నది వద్దకు వెళ్లి పడవలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ప్రమాదం కలగకుండా వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారు ప్రయాణిస్తున్న 7 పడవలను సీజ్ చేశారు. పడవ నడిపిన వారిపై కూడా కేసు నమోదు చేశారు. ఒక పడవలో ప్రయాణిస్తున్న ఇద్దరిని క్వారంటైన్ కి తరలించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు రాత్రీపగలు నిద్రాహారాలు మాని.. కష్టపడి విధులు నిర్వర్తిస్తున్నారనడానికి ఈ చిన్న సంఘటనే నిదర్శనమని పోలీసువర్గాలు అంటున్నాయి. నది పరివాహక ప్రాంతంలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన సీఐ ఉమేష్ మరియు సిబ్బందిని గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్. విజయరావు అభినందించారు. చట్ట విరుద్ధంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ప్రజలను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి ప్రయత్నించిన వారి వాహనాలు సీజ్ చేసి, వారిపై కేసు పెడతామని ఎస్పీ హెచ్చరించారు.
For More News..