
సినీ నటుడు, బీజేపీ నేత బాబు మోహన్
తిరుపతి: తెలంగాణలో రైతుల కష్టాలు వర్ణనాతీతం.. రైతును చులకనగా చూస్తున్నారు.. ఇక ప్రజల విషయానికి వస్తే చావగొట్టే పరిస్థితి ఉంది.. అంటూ సినీ నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అప్పట్లో యన్టీఆర్ ప్రజలే దేవుళ్లు అన్నారు.. కానీ ఇప్పుడు పాలకులకు ప్రజలు బానిసలుగా మారారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ లో ప్రజలను చావ కొడుతుంటే.. ఏపీలో అన్యాయాలను ప్రజలు ప్రశ్నిస్తే గుండు కొడుతున్నారని బాబు మోహన్ ఆరోపించారు. తెలంగాణ లో కుటుంబ పాలన కొనసాగుతోంది.. అర్జంటుగా కేటీఆర్, కవితని కీలక పదవుల్లో కూర్చోపెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడని బాబు మోహన్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఎంత ప్రయత్నించినా.. వారిపై ఉన్న అసంతృప్తితో ప్రజలు దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీకి ఘన విజయం కట్టబెట్టారని బాబు మోహన్ పేర్కొన్నారు.
తిరుపతితో నాకు అవినాభావ సంబంధం -బాబుమోహన్
తిరుపతికి నాకు అవినాభావ సంబంధం ఉంది… నెలకు నాలుగు సార్లు షూటింగ్ పనిమీద వచ్చేవాడిని.. సమయం దొరికినపుడు శ్రీవారిని దర్శించుకునే వాడినని బాబు మోహన్ గుర్తు చేసుకున్నారు. ఇవాళ శ్రీవారికి మూడు దండాలు పెట్టుకున్నా… మొదటిది దుబ్బాక.. రెండోది జీహెచ్ఎంసీ ఎన్నికలు.. మూడోది తిరుపతి ఉప ఎన్నిక.. ఈ మూడు దండాలకు త్వరలోనే ప్రతిఫలం వస్తుందనే నమ్మకం ఉందని బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం తధ్యమన్నారు. సినీ నటులు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు, విజయశాంతి బీజేపీ లోకి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. మోడీ నాయకత్వంలో దేశం సస్యశ్యామలం అవుతుంది.. నా వంతుగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని బాబు మోహన్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ఫలితాన్ని ఇస్తుందని.. హైదరాబాద్ లో మెగా ఫ్యామలీ కి ఉన్న క్రేజ్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
for more News….