హైదరాబాద్లో సెల్ టవర్లకు దగ్గర్లో ఉన్నోళ్లు జాగ్రత్త.. .. అలా చేస్తే సేఫ్ అంటున్న హైడ్రా !

హైదరాబాద్లో సెల్ టవర్లకు దగ్గర్లో ఉన్నోళ్లు జాగ్రత్త.. .. అలా చేస్తే సేఫ్ అంటున్న హైడ్రా !

హైదరాబాద్ లో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారింది. వర్షాకాలం ఆరంభానికి ముందే వచ్చిన వానలు.. మధ్యలో మొహం చాటేశాయి. మళ్లీ ఎండాకాలాన్ని తలపించిన వాతావరణం.. గత రెండు మూడు రోజులుగా చల్లబడుతూ వచ్చింది. శుక్రవారం (జులై 18) ఉన్నట్లుండి వెదర్ పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలు మరో మూడు నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

 భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో హైదరాబాద్ ప్రజలను మెసేజ్ ల ద్వారా అలర్ట్ చేసింది హైడ్రా టీం. వర్షాలు కురుస్తున్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మొబైల్ టవర్ సిగ్నల్ కింద ఉన్న ప్రజలందరికీ హైడ్రా రెయిన్ అలెర్ట్ మెసేజ్ పంపించింది. టవర్స్ కు సమీపంలో ఉన్న ప్రజలకు వ్యక్తిగత మెస్సేజ్ లు పంపించింది. 

మరో రెండు గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అలర్ట్ గా ఉండాలని మెసేజ్ లు పంపింది  హైడ్రా. వెస్ట్, సౌగ్, సెంట్రల్, ఈస్ట్ హైదరాబాద్ ప్రజలు అలర్ట్ గా ఉండాలని.. భారీగా ఉరుములు మెరుపుల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ లు పంపింది. 

హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నందున సెల్ ఫోన్లు పక్కన పెట్టాలని సూచించింది. భారీ ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో నెట్ ఆఫ్ చేసి పెట్టుకోవాల్సింది హైడ్రా సూచించింది. 

Also Read:-వచ్చే నాలుగు రోజులు వానలే వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ !

అదే విధంగా మెరుపుల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ సమయంలో ఫోన్ మాట్లాడకుండా ఉంటే మంచిదని సూచించారు అధికారులు. నెట్ ఆన్ చేయడం, కాల్స్ మాట్లాడటం వలన షాక్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని.. వర్షం నిలిచే వరకు అత్యవసరం అయితే తప్ప ఫోన్లు మాట్లాడక పోవడం బెటర్ అని తెలిపింది. 

వర్షం కురుస్తున్న సందర్భంలో బాల్కనీలో ఉంటూ ఫోన్ మాట్లాడటం మరింత ప్రమాదమని తెలిపింది హైడ్రా. మరొక రెండు గంటల పాటు హైదరాబాదు ఓఆర్ఆర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారి చేసింది. వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని.. బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. 

అదే విధంగా వర్షం కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడుతుందని.. వెళ్లే దారిలో ట్రాఫిక్ ఉందేమో చెక్ చేసుకోవాలని హైడ్రా సూచించింది. జీహెచ్ఎంసీ నుంచి ఓఆర్ఆర్ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (SDMA) సూచనలు తప్పక పాటించాల్సిందిగా సూచించింది.