
ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ధ్రోణి, నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉన్న వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం, తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తున్నాయి.
ఇవాళ (జులై 18) హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.
Also Read:- హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ రూట్లలో వెళ్లేవారు జాగ్రత్త.. !
శనివారం (జులై 19) కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.