
- ఆపరేషన్ సిందూర్‌కు కామా పెట్టాం.. ఫుల్‌స్టాప్ కాదు
- పహల్గాం దాడికి ఆపరేషన్ సిందూర్‌తో సమాధానమిచ్చాం
- పాకిస్తాన్‌కు ఏ దేశం నుంచి కూడా నిధులు వెళ్లకుండా చేయాలి
- ‘ఫాదర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజం’గా పాక్ మారిందని కామెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) కలిసే రోజు మరెంతో దూరంలో లేదని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక చర్చను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా పీవోకేను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలపై స్పందిస్తూ.. ‘‘ఈ డిమాండ్‌పై నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఎందుకంటే వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని (పీవోకే) పాక్‌కు అప్పజెప్పి, ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా ఆ రోజు వస్తుంది. పీవోకే ప్రజలు భారత ప్రభుత్వంలో భాగమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు” అని రాజ్‌నాథ్ తెలిపారు. పహల్గాం దాడికి ఆపరేషన్ సిందూర్‌తో సమాధానమిచ్చామని చెప్పారు. పాక్ కాళ్లబేరానికి రావడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామని వెల్లడించారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు. ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చాం అంతే. ఇది నిరంతరం కొనసాగుతుంది. మన దేశంలో పాక్ మళ్లీ ఉగ్రదాడులకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్‌ను తిరిగి ప్రారంభిస్తం. ప్రస్తుతానికి దానికి కామా పెట్టాం అంతే..
ఫుల్‌స్టాప్ పెట్టలేదు” అని వెల్లడించారు.
పాక్‌కు ఫండ్స్ ఇవ్వొద్దు..
ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నదని రాజ్‌నాథ్ మండిపడ్డారు. ‘‘భారత్, పాక్ ఒకేసారి స్వాతంత్ర్యం పొందాయి. కానీ ఈరోజు ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’గా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందితే.. ‘ఫాదర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజం’గా పాక్ అవతరించింది” అని విమర్శించారు. పాకిస్తాన్‌కు ఫండింగ్ ఇవ్వడం నిలిపివేయాలని ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి విజ్ఞప్తి చేశారు. ‘‘ఉగ్రవాదులకు ఆశ్రయం, నిధులు ఇస్తున్న దేశాల బాగోతాన్ని ప్రపంచం ముందు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. పాక్‌కు వెళ్తున్న నిధులు, ఆర్థిక సాయంలో అధిక భాగం ఉగ్రవాద కార్యకలాపాలకే మళ్లుతున్నాయి. దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి” అని కోరారు. కౌంటర్ టెర్రరిజం ప్యానెల్‌లో పాకిస్తాన్‌కు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టడాన్ని తప్పుబడుతూ
ఐక్యరాజ్య సమితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీవల్ల కాకుంటే.. మేమొస్తం
పాకిస్తాన్‌లో ఉగ్రవాద నిర్మూలన ఆ దేశ సర్కార్ వల్ల కాకుంటే, సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్ తెలిపారు. ‘‘పాకిస్తాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్నదే భారత్ లక్ష్యం. పాకిస్తాన్‌కు నేనొక సలహా ఇస్తున్నాను.. మీ దేశంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం మీ వల్ల కాకుంటే.. మా సాయం తీసుకోండి. బార్డర్ లోపల, ఆవతల టెర్రరిస్టుల పని పట్టే సత్తా ఇండియన్ ఆర్మీకి ఉంది. ఇది ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపితమైంది. ఈ విషయం మీకు (పాక్) కూడా తెలుసు” అని అన్నారు.