న్యాల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న శ్రీ ఆశా ఆల్డిహైడ్స్ అండ్ అడ్హెసివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రజలు వ్యతిరేకించారు. ఈ కంపెనీ వల్ల జరిగే నష్టాన్ని సైంటిస్ట్ ఫర్ పీపుల్ సంస్థలు 10 రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మల్గిగ్రామంలో నిర్వహించారు.
కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురితోపాటు పీసీబీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కంపెనీ స్థాపన వల్ల మల్గి, చుట్టుపక్కల గ్రామాలకు జరిగే నష్టాలపై ప్రజలు అధికారులకు వివరించారు. కంపెనీ తరపున ఏపీలోని అనంతపురం, హైదరాబాద్ నగరాల నుంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై కంపెనీ ఏర్పాటైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మీ కంపెనీ వద్దు.. మీ సలహాలు వద్దు అంటూ ప్రజలు వారిని నిలదీశారు. దీంతో చేసేదేమిలేక అధికారులు ప్రజల అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీబీ అధికారి విజయలక్ష్మి, ఆర్డీవో దేవుజ, తహసీల్దార్ప్రభు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా సైంటిస్ట్ ఫర్ పీపుల్ నాయకుడు డాక్టర్ బాబూ రావు, టీపీజాక్ రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్, జిల్లా నాయకులు లక్ష్మి, మానస ప్రజలకు మద్దతు తెలిపి మాట్లాడారు. కర్నాటక సరిహద్దుకు కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌కు కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర స్థాయిలో అనుమతులు కోరడం చట్టవిరుద్ధమన్నారు.
హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు తాగు, సాగుకు నీరు అందిస్తున్న తరుణంలో ఆ నీటిలో ఈ కంపెనీ వ్యర్థ జలాలు కలుషితమై ఇటు ప్రజలు.. అటు పంటలు నాశనమయ్యే అవకాశం ఉందన్నారు. ప్లాంట్ తయారు చేసే ఫార్మాల్డిహైడ్ రసాయనం వల్ల ప్రజలకు క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కంపెనీ ఏర్పాటుకు రూ.36 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే కేవలం 25 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
