ఆదిలాబాద్​లో రామన్నకు అగ్నిపరీక్ష

ఆదిలాబాద్​లో రామన్నకు అగ్నిపరీక్ష
  • పాంచ్​ పటాకా పేలుస్తా అంటున్న జోగు రామన్న
  • బీజేపీకి ఒక్కచాన్స్ అడుగుతున్న పాయల్​ శంకర్
  • పార్టీ వేవ్, ప్రభుత్వ వ్యతిరేకతపై కంది శ్రీనివాస్ ఆశలు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య టఫ్​ ఫైట్ ఉండేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్​ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న బరిలో నిలవగా, బీజేపీ నుంచి పాయల్ శంకర్, కాంగ్రెస్​ నుంచి కంది శ్రీనివాస్​రెడ్డి పోటీ చేస్తున్నారు. 1952లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడగా, ఐదుసార్లు ఇండిపెండెంట్లదే పైచేయి అవుతూ వచ్చింది. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా జోగురామన్న విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆయన 2012 బైఎలక్షన్స్, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన  రామన్నకు ఈసారి విజయం అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. ఈసారి ఆయనకు బీజేపీ, కాంగ్రెస్ క్యాండిడేట్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎలాగైనా బీజేపీ జెండా పాతాలని పాయల్​శంకర్ ప్రయత్నిస్తుండగా, ఫస్ట్​ టైమ్​అసెంబ్లీ రేసులోకొచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డి  పార్టీ వేవ్, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్నారు.

రామన్నకు వ్యతిరేక పవనాలు..

నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన జోగు రామన్న మరోసారి నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. గడిచిన పదేండ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కాగా, ప్రచారంలో రామన్నకు నిరసన సెగలు తగులుతున్నాయి. ఆయనను ఎక్కడికక్కడ జనం నిలదీస్తున్నారు. చాలాచోట్ల గొర్రెల యూనిట్లు ఇవ్వలేదని గొల్ల, కురుమలు అడ్డుకుంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బంధు, బీసీ బంధు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. వీటికితోడు ఎన్నికల హామీలైన చనాకా కొరాటా ప్రాజెక్టు, ఆదిలాబాద్​ టౌన్​లో రైల్వే బ్రిడ్జిలు పూర్తి చేయకపోవడం, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటులో జాప్యం ఆయన గెలుపుపై ప్రభావం  చూపనున్నాయి. పైగా రామన్నకు ఇంటిపోరు ఎక్కువైంది. ఆయనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్​లోనే మరో వర్గం నడుస్తోంది. ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని పలువురు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీశా ఆదిలాబాద్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆమె ఇండిపెండెంట్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన ఆదిలాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్‌‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గోవర్దన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు పోరెడ్డి కిషన్, సీనియర్ నాయకులు గణపతిరెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ మంచాల పొచ్చన్నలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.

శ్రీనివాస్​రెడ్డికి అసమ్మతి సెగ..

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరు నెలల్లోనే కంది శ్రీనివాస్​రెడ్డి ఆదిలాబాద్ టికెట్​ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. పార్టీలోని సీనియర్ల మద్దతు లేకుండానే ప్రచారం కొనసాగిస్తున్నారు. అటు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తో పాటు, పీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. పైగా కందికి టికెట్ దక్కడంపై తీవ్ర అసంతృప్తి ఉన్న ఈ ముగ్గురు తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇందులో సంజీవ రెడ్డి  కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు పెరిగిన వేవ్​ తనకు కలిసొస్తుందని శ్రీనివాస్​రెడ్డి భావిస్తున్నారు.