సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి కోసం చేపడుతున్న బ్లాస్టింగ్ లతో తమ ఇండ్లు కూలిపోతున్నాయని గని సమీప గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట ప్రజలు ధర్నాకు దిగారు. కేకే ఓపెన్ కాస్ట్ ఏర్పాటు సందర్భంగా దుబ్భగూడెం, సోమగూడెం(కే), గోండు గూడెం పంచాయతీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతిరోజు గనిలో చేపడుతున్న బ్లాస్టింగ్ లతో ఇండ్లు కూలిపోతాయన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం కనీసం తాగునీటిని కూడా తమ గ్రామాలకు సరఫరా చేయడం లేదని ఆరోపించారు. మూడు పంచాయతీలను ముంపు ప్రాంతంగా గుర్తించి ప్యాకేజీ ఇవ్వాలని, లేకపోతే ఓపెన్ కాస్ట్ పనులను అడ్డుకుంటామని గ్రామస్థలు హెచ్చరించారు.
