హరితహారం కాదు.. వేప చెట్లను కాపాడండి

హరితహారం కాదు.. వేప చెట్లను కాపాడండి

వేప చెట్లు ఉన్నట్టుండి ఎండిపోతున్నాయి. ఒకట్రెండు చెట్లు కాదు.. ఊర్లో ఉన్న చెట్ల ఆకులన్నీ మాడిపోతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. చెట్లకు ఏదో వైరస్ సోకిందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. దీంతో జనం మరింత వణికిపోతున్నారు. చూస్తుండగానే ఆకులు మాడిపోవడం, వేర్లు కూడా ఎండిపోతుండటం, కొన్ని రోజుల్లోనే చెట్టు చచ్చిపోతుండటం.. భయానికి కారణమవుతోంది. డై బ్యాక్  డిసీజ్  అని కొందరు చెబుతోంటే, టీ మస్కిటో బగ్  కారణమని మరికొందరు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల కారణంగా కూడా చెట్లకు మాడిపోతున్నాయని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ.. వేప చెట్లు ఎందుకు మాడిపోతున్నాయి..? జనంలో ఉన్న ఆందోళనలేంటీ..? ఇప్పుడు చూద్దాం.  వేపాకు, వేపపూత ఇలా వేప చెట్టు నుంచి వచ్చే ప్రతి భాగం కూడా మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అంటుంటారు. కానీ ఇప్పుడా  వేపచెట్టుకే నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రమాదం ముంచుకొచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి, నాగర్ కర్నూల్ ,తిమ్మాజీపేట, తాడూర్, తెలకపల్లి మండలాల్లో కొన్ని రోజులుగా వేప చెట్లు ఎండిపోతున్నాయి. మొదట చెట్టు కొనలు కాలిపోయినట్టుగా మారి తర్వాత మోడువారుతున్నాయి. వేపచెట్లు ఎండిపోవటం ఎప్పుడూ చూడలేదని గ్రామాల్లోని పెద్దవాళ్లు చెబుతున్నారు. పొద్దున వేప పుల్లతో పండ్లు తోమడం దగ్గర నుంచి ఆయుర్వేదంలో వేపాకు, పూత, బెరడుకు చాలా ప్రాధాన్యత ఉంది.  డయాబెటిస్ నివారణలోనూ వేపను వాడతారు. పండుగలు, పూజలకు వేప కొమ్మలను గుమ్మాలకు కడతారు. ఇండ్లలో దోమల నివారణకు, పంటలపై  చీడ పీడలు వదిలించేందుకు వేపాకు రసాన్ని పిచికారీ చేస్తారు.  ఇన్ని ప్రయోజనాలు ఉన్న వేపచెట్లు ఎండిపోవడం బాధగా ఉందంటున్నారు గ్రామాల్లోని పెద్దలు.

వేప చెట్లకు డై బ్యాక్ తెగులు సోకుతోంది. ఇది పోమప్సస్ అజిడిరక్టే అనే శిలీంద్రం ద్వారా వస్తుంది. కర్ణాటకలో 1997లో సతీష్ అనే శాస్త్రవేత్త పరిశోధన బృందం గుర్తించింది.  ఈ వ్యాధి వేప చెట్టు ఎత్తు, వయసుతో సంబంధం లేకుండా వస్తుంది.  కొమ్మలపై ఆకులు, పూతపై మచ్చలు రావడం, వేప పండ్లు కుళ్ళి పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ బ్లైట్ తెగులు నివారణకు బావిస్టన్ అనే మంది బాగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఈ శిలీంద్రం విత్తనాల ద్వారానే వస్తున్నందున నర్సరీల్లో మొక్కలు పెంచేటప్పుడే విత్తనశుద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  పాలెంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉన్న  సైంటిస్టులు మాత్రం వేపచెట్లు ఎండిపోవడం తమకు తెలియదంటున్నారు. పరిశోధన చేస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ ఉన్న చెట్లను పట్టించుకోవట్లేదంటున్నారు జనం.