ఎన్నికల హామీలపై మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డిని నిలదీసిన ప్రజలు

ఎన్నికల హామీలపై మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డిని నిలదీసిన ప్రజలు

మునుగోడు, వెలుగు: ఎన్నికల టైంలో సీఎం కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయడం లేదంటూ నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం కుదాబక్ష్ పల్లి గ్రామస్తులు బుధవారం మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డిని నిలదీశారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు గ్రామానికి వచ్చిన మంత్రిని ఏఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ లీడర్లు, ప్రజలు అడ్డుకున్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కొత్త పెన్షన్లు ఎదుకివ్వడం లేదని, రైతు రుణమాఫీ, రేషన్‌‌‌‌ కార్డులు, డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్ల హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. చర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్‌‌‌‌లు పెట్టుకొని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలను పట్టించుకునే తీరిక పాలకులకు లేకుండా పోయిందని విమర్శించారు. చివరికి చెక్కులు పంపిణీ చేయకుండానే మంత్రి జగదీశ్ రెడ్డి వెళ్లిపోయారు.

కేంద్రం కక్షగట్టింది: జగదీశ్​ రెడ్డి

నల్గొండ జిల్లా మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోని పలు గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం జగదీశ్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే అనేక పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా బ్యాంక్‌‌‌‌ లోన్లను అడ్డం పెట్టుకొని ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులను ఆపాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. తర్వాత సమస్యలపై పలువురు లీడర్లు మంత్రికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.